పండుగ వాతావరణంలో రైతు రుణమాఫీ మలివిడత నిధుల విడుదల
కలెక్టరేట్ లో రైతులకు లాంఛనంగా చెక్కుల అందజేత
రుణమాఫీతో అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరాలి : కలెక్టర్
సమస్యలు ఉంటే 7288894616 7288894600 నెంబర్లకు సంప్రదించాలని సూచన
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి, జూలై 30 :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ-2024 మలివిడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ సంగవాన్ అధ్యక్షతన లబ్దిదారులైన రైతులు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి, ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. జిల్లాలోని 25 రైతు వేదికలలోనూ రుణ మాఫీ మలివిడత నిధుల విడుదల కార్యక్రమం కొనసాగగా, ఎక్కడికక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ, సంబురాలు జరుపుకున్నారు. ఒకే పంటకాలంలో రూ. రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి ఆశిష్ సంగవన్ లబ్దిదారులైన పలువురు రైతులకు రెండవ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. రైతులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాలలో రూ. 31 వేల కోట్లు జమ చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ నెల 18న లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయగా, మలివిడతగా ప్రస్తుతం లక్షా 50 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందన్నారు. రుణమాఫీ ద్వారా జిల్లాలో మొదటి విడతలో49540 మంది రైతు కుటుంబాలకు రూ. 231 కోట్ల మేర లబ్ది చేకూర్చగా, మలివిడతలో 24816 మంది రైతు కుటుంబాలకు రూ. 211 కోట్ల నిధులను వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ వివరించారు. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే తొలివిడత మాఫీకి సంబంధించి 1209 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలుపడని రైతులు నేరుగా7288894616 7288894600 నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు అన్నదాతలకు తోడ్పాటును అందించాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన మలివిడత రుణమాఫీ నిధులను రెండు రోజుల్లోపు రైతుల ఖాతాలలో అందుబాటులో ఉండేలా చూడాలని, వారు తమ అవసరాల కోసం ఆ నిధులను వినియోగించుకునేవిధంగా చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. తొలి, మలివిడతలలో రుణమాఫీ పొందిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి,, లీడ్ బ్యాంకు మేనేజర్, రవికాంత్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక, రైతులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.