సమాజాన్ని వెలిగించేది కవిత్వం ”
తేటతెలుగు తేనెలూరే పదాలతో
జతకట్టిన కవిత్వం ఓ చెట్టుకు పూసిన పువ్వు కాదు…
ఓ చెట్టుకు కాసిన కాయ కాదు..
దొరికే వస్తువు కాదు..దొంగిలించే సరుకూ కాదు..
మృదు మధుర భావాల పొందిక!..
గుచ్చుకున్న ముళ్ళబాధ నుంచి..
విచ్చుకునే స్నేహపరిమళం నుంచి..
గాయాల గాధల నుంచి..బాధించే బతుకుల నుంచి..
నిరంతరం తపించే ..నిశ్శబ్ద జీవితాల నుంచి…
పైశాచిక కృత్యాల నుంచి..
అంతర్గత కల్లోల కలతల నుంచి
బాధలు బాధించినప్పుడు
బతుకులు బరువెక్కినప్పుడు
దాహార్తుల గుండెలను తడిపే కవిత్వం పుట్టుకొస్తుంది..
ఆలోచనల ఉద్యమానికి ఊపిరి పోసేదే కవిత్వం…
మథన పడే.. మనసుకు పూసే పువ్వే కవిత్వం
వేదనలు నిండిన
గుండెకు కాసిన కాయే కవిత్వం
అప్పుడప్పుడు వలపుతో
అల్లుకునే లతలలో నుంచి..
విరబూసే ప్రకృతిసోయగాల నుంచి..
కవిత్వం పుడుతుంది..!
దీని పుట్టుక ఓ అంతరంగమధనం
దీని ప్రభావం ఓ మానవీయతకు మార్గం
మెదడును తొలిచేస్తూ ఉంటుంది
కెరటాల్లా ఎగసిపడుతూ లేస్తుంది..
ఇది ఎన్నటికీ చెరగని జ్ఞాపకం..
ఎవరికీ కనబడని భావం..
ఎప్పటికీ అంతరించిపోని నిత్యస్మృతిపథం..
ఆగిపోని నడక ఇది..సాగిపోయే చైతన్యమిది..
వీక్షించే ఓ ప్రభాకరమిది..ప్రకాశించే శుభకరమిది..
సర్వజగత్తును సౌమ్యంగా
సుకుమారంగా స్పర్శిస్తుంది..
తరతరాలకూ స్ఫూర్తిప్రదాతగా నిలబడుతుంది…
నిత్యం పరిమళిస్తూ ప్రభాసిల్లుతుంది..
అజ్ఞాన చీకటిలో జ్ఞానమై వెలుగొందుతుంది..
అర్థంలేని జీవితాలకు ఓ పరమార్థమై నిలబడుతుంది..
వ్యక్తిలోని వికాసపు జ్ఞాననేత్రమే కవిత్వం…
నిజానికి ఈ జగాన్ని ఏలేదే కవిత్వం..
సమాజాన్ని వెలిగించేది కవిత్వం…
సమ సమాజాన్ని స్తాపించేది కవిత్వం!!..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.