నారద వర్తమాన సమాచారం
వారం వారం మండలాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు: ప్రత్తిపాటి
యడ్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించిన ప్రత్తిపాటి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వారంవారం మండలాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు నిర్వహించనున్నట్లు తెలిపారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మె ల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రతివారం ఒక మండలంలో ఈ వేదిక నిర్వహించి ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశా లతో పాటురెవిన్యూ సమస్య ల వరకు అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. యడ్లపాడు ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. మండలంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఇంటి స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగళ్లు, రీసర్వేలో తప్పులు, హద్దు రాళ్లు తొలగించడం, అధిక ధరకు ఎరువుల విక్రయం, రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలని అర్జీల రూపంలో పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గృహ రుణాల బకాయిలు చెల్లించాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం తరఫున పైప్‌లైన్లు వేయాలని దరఖాస్తులు వచ్చాయి. జాతీయ రహదారి సర్వీస్ రోడ్‌లో ఆక్రమణలు తొలగించాలని, యడ్లపాడు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవడంతో పాటు సర్వీసుల సంఖ్య పెంచాలని, గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఆశా వర్కర్లను నియమించాలని అందిన ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మాట్లాడిన ఆయన నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం, 3 మండలాలు ఉన్నాయని, నెలకోసారి గ్రీవెన్స్ సెల్‌కు తానే హాజరవుతానని తెలిపారు. గత ఐదేళ్లలో ఎవరైనా వైసీపీ అరాచకాలకు, అధికారదాహానికి నష్టపోయుంటే ఆ సమస్యలూ గ్రీవెన్స్ సెల్‌లో చెప్పుకోవచ్చన్నారు. రేషన్ కార్డులు, సర్వే, ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములకు దారి, శ్మశానాలకు స్థలం ఉంటే ఇవ్వడం లాంటివి సీఎం, ఉన్నత స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. అధికారుల స్థాయిలో చేయదగినవి ఉంటే సత్వరమే పరిష్కరించాలని, వచ్చే సమావేశానికి మళ్లీ ఈ ఫిర్యాదులు రాకూడదన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం దిశగా యాక్షన్ ప్లాన్ ఉండాలని అధికారులను కోరుతున్నామని తెలిపారు. రేషన్ కార్డులు, పింఛన్లపై ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. హౌసింగ్ చెల్లింపులపై కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయబోతుందని, ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత హౌసింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరోజు అయితే ప్రకటిస్తారో ఆరోజు నుంచి కూడా పింఛన్లు, రేషన్ కార్డులు, హౌసింగ్ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతుందన్నారు. రెవెన్యూ సర్వే గానీ కొలతల్లో మార్పులు గానీ ఆన్‌లైన్‌లో ఎక్కించడం గానీ శ్మశానాల స్థలాలు గానీ ఇంటి స్థలాలు గానీ ఎక్కడైనా ప్రభుత్వ భూములు సమస్యలు ఉంటే వెంటనే తహసీల్దార్ పరిష్కారం చేస్తారన్నారు. ఎరువుల సమస్య ఉందని తన దృష్టికి తెచ్చారని, రూ. వంద ఎక్కువగా విక్రయిస్తున్నారని చెప్పారని, తొలుత హెచ్చరిస్తామని, రెండోసారి లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. ఎక్కడా అధిక ధరలకు ఎరువులు విక్రయించడానికి వీల్లేదని, ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు ఎరువుల విక్రయ దుకాణాల్లో కూడా అధిక ధరకు విక్రయించడానికి వీల్లేదని, ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రైవేట్ ఎరువుల విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు. ఎక్కడైనా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు నిర్ధరణ అయితే వారి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.