నారద వర్తమాన సమాచారం
పోలి స్వర్గదీపం
అరటిదొప్పలో వెలుగుతున్న దీపాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టే పర్వం తెలుగు మహిళలు ఆచరించే పోలిస్వర్గ దీపం, మార్గశిర శుద్ధ పాడ్యమి నాటి తెల్లవారుజామున నదీతీరాలన్నీ పుణ్యస్నానాలు ఆచరించే, దీపాలు విడిచే మహిళామణులతో నిండిపోతాయి.
పవిత్ర కృష్ణానదీ తీరాన బాదర గ్రామంలో పోతడు అనే పేరుగల రజకుడు ఉండేవాడు. అతని భార్య గయ్యాళి. వారికి నలుగురు కుమారులు. అందరికీ తగు సమయంలో పెళ్లిళ్లు చేశారు. మొదటి ముగ్గురు కోడళ్లు అత్తగారి స్వభావం పుణికి పుచ్చుకున్నారు. నాల్గవ కోడలు పోలి మాత్రం మృదు స్వభావురాలు. అత్త అయిన మాలితో పాటు మిగిలిన తోడికోడళ్లు ఇంటిపనులన్నీ పోలిపై వదిలేసేవారు. పోలి మాత్రం శాంతస్వభావాన్ని, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడిచిపెట్టలేదు. కార్తిక మాసంలో గ్రామవాసులంతా ప్రతి ఉదయం స్నానం చేసేందుకు కృష్ణానదికి వెళ్లేవారు. అత్త, తోటికోడళ్ళు ముగురూ పోలిని మాత్రం ఇంటిదగ్గర ఉంచి వారంతా నదీస్నానానికి వెళ్లేవారు. నదీస్నానం, దీపారాధన చేయాలని ఆసక్తి కలిగిన పోలి ఇంటిలోనే స్నానం చేసి కవ్వానికి అంటిన వెన్న కరిగించి దీపారాధన చేసేది. అలా నెలరోజుల పాటు చేసిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమినాటికి శ్రీ మహావిష్ణువుకు అనుగ్రహం కలిగింది. పోలి సశరీరంగా వైకుంఠానికి చేరింది.
ఉద్యాపన
అసూయ, హింసా ప్రవృత్తి భగవంతుడు మెచ్చడు. ఆయనకు కావలసింది నిశ్చలమైన, పరిపూర్ణమైన భక్తిమాత్రమే. ఉన్నంతలో యధాశక్తిగా ఆరాధించిన వారిని భగవంతుడు ఎప్పుడూ సంరక్షించి అక్కున చేర్చుకుంటాడు. ఈ నీతిని తెలిపే కథ ‘పోలి స్వర్గదీపం’. కార్తిక స్నానం, దీపారాధన వ్రతదీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాడ్యమినాడు ఉద్యాపన చేసుకుంటారు. తెల్లవారు జామునే నదీస్నానం చేస్తారు. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు. తెలుగునాట ఈ పర్వాన్ని విస్తృతంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కృష్ణానదీ తీర క్షేత్రాలైన విజయవాడ వంటిచోట్ల మార్గశిర శుద్ధ పాడ్యమికి విశేష సంఖ్యలో మహిళా మణులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇంటికి చేరుకున్న తరువాత పోలి స్వర్గం కథను చెప్పుకుని అక్షతలు తలమీద వేసుకుంటారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.