నారద వర్తమాన సమాచారం
ఏపీకి అమిత్ షా.. జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా?
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ప్రభుత్వం పని తీరు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా గడిచిన ఐదేళ్ల కాలంలో సంక్రాంతి పండుగను సైతం సరిగా జరుపుకోలేకపోయిన ఏపీ ప్రజలు ఈ ఏడు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కిందటేడాది వరకూ వెలవెలబోయిన జగ్గన్నతోట ప్రభల తీర్ధం ఈ ఏడాది ఇసుక వేస్తే రాలనంత జనసందోహంతో కలకలలాడింది. కూటమి పాలనలో గ్రామ గ్రామాన పండుగ శోభ ఉట్టిపడింది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి కేంద్రం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అన్నీ తీపి కబుర్లే చెబుతూ వస్తున్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుతో పాటు వైసీపీ హయాంలో ప్రజలు ఎందుర్కొన్న ఒక్కో ఇబ్బందిని తొలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. దీంతో అన్నివర్గాల ప్రజలూ కూటమి పాలన పట్ల హ్యాపీగా ఉన్నారు. మరో వైపు వచ్చేనెల అంటే ఫిబ్రవరి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ సమాయత్తమైంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం, రాబోయే రోజులలో అన్ని హామీలను అమలు చేసేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇదే సమయంలో తాజాగా కేంద్రం ఏపీకి మరో తీపికబురు చెప్పింది.
ప్రైవేటీకరణ ముప్పు ఎదుర్కొంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం కాపాడుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,400 కోట్ల రూపాయల బెయిలౌట్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక పరమైన కష్టాలు తీరినట్లే. వైసీపీ హయంలో స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం అడుగులు వేసింది.. అయితే, జగన్ సర్కార్ కేంద్రం ఆలోచనలకు ఏమాత్రం ఎదురు మాట్లాడలేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతుందన్న ఆందోళన వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని కేంద్రానికి తెగేసి చెప్పారు. దీంతో కేంద్రం వెనక్కు తగ్గింది. అంతేకాక ఇప్పుడు భారీ ఆర్థిక ప్యాకేజీనిసైతం ప్రకటించింది.
అదలా ఉంటే.. చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలన సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సమయంలో ఏపీ పర్యటనకు హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను అమిత్ షా ఆదివారం (జనవరి 19)ప్రారంభించనున్నారు. ఈ పర్యటన కోసం శనివారం (జనవరి 18) రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షాకు.. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. ఈ విందు భేటీపైనే అందరిచూపు కేంద్రీకృతమైంది. చంద్రబాబు, అమిత్ షా భేటీలో రాజకీయపరమైన అంశాలు, ముఖ్యంగా జగన్ కేసుల గురించి ప్రస్తావన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిపోయింది. జగన్ అరాచక, అస్తవ్యస్త పాలన కారణంగా రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. వ్వస్థతలన్నీ నిర్వీర్యమయ్యాయి. పాలన గాడి తప్పింది. చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఈ ఏడు నెలల కాలంలో అన్ని విధాలుగా గాడితప్పిన రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి రాష్ట్రం ప్రగతి బాటలో అడుగులు వేసేలా చేసేందుకే అత్యథిక సమయం కేటాయించారు. చాలా వరకూ సఫలీకృతమయ్యారు. ఆ క్రమంలో ఆయన రాజకీయాలను దూరం పెట్టారు. ఇప్పుడు రాష్ట్రం పురోగమన బాట పట్టిన తరువాత ఇక రాజకీయంగానూ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంలో ముఖ్యంమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడిన పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన పలువురు వైసీపీ నేతలపైనా పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో కొందరు ఇప్పటికే జైలుకెళ్లారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకొని జగన్ భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలే కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలని అమిత్ షా వద్ద చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వైసీపీ హయాంలో లిక్కర్, ఇసుక వ్యవహారాల్లో భారీ స్కాములు ఉన్నాయి. ఇసుక వ్యవహారంపై సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక లిక్కర్ స్కాములోనూ అంతే. వీటిలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని.. ఆ డబ్బులు ఎక్కడెక్కడకి ఎలా చేరాయో కూటమి ప్రభుత్వం ఆధారాలు సేకరించిందని ప్రచారం జరుగుతున్నది. వీటన్నింటిపై చంద్రబాబు నివాసంలో అమిత్‌షాకు ఇచ్చే విందు భేటీలో చర్చించి.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని కక్కిస్తామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవల అమిత్‌షా, ప్రధాని మోడీని కలిసిన సందర్భంలోనూ వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై వారి దృష్టికి తీసుకెళ్లారన్న ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకేమాటపై ఉండటంతో అమిత్ షా వారి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి చంద్రబాబు నివాసంలో అమిత్ షా విందు భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.