నారద వర్తమాన సమాచారం
కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం లేదు.. మరోసారి మోదీనే పీఎం: దావోస్ లో చంద్రబాబు
వారసత్వం అనేది మిథ్య అన్న చంద్రబాబు
అవకాశాలను అందిపుచ్చుకుంటేనే రాణించగలరని వ్యాఖ్య
ఎవరైనా మోసం చేసి ఒకసారి మాత్రమే అధికారంలోకి రాగలరన్న బాబు
జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదన్న సీఎం
అదానీ కాంట్రాక్టు వ్యవహారం యూఎస్ కోర్టులో పెండింగ్ లో ఉందన్న చంద్రబాబు
రాజకీయం, సినిమాలు, వ్యాపారం, కుటుంబం ఏదైనా సరే వారసత్వం అనేది మిథ్య అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ వారసత్వంపై దావోస్ లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని… వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని చెప్పారు.
జీవనోపాధి కోసం తాను రాజకీయాలపై ఆధారపడలేదని… అందుకే 33 ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాలను ప్రారంభించానని చంద్రబాబు చెప్పారు. బిజినెస్ అయితే లోకేశ్ కు తేలికైన పని అని… కానీ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. లోకేశ్ రాజకీయాల్లోకి రావడంలో కుటుంబ వారసత్వం లేదని… ప్రజా సేవలో ఆయన తృప్తిగా ఉన్నారని చెప్పారు.
వనరులను లూటీ చేసి డబ్బులు సంపాదించడం దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని చంద్రబాబు అన్నారు. జగన్ మళ్లీ సీఎం అయితే ఏమిటనే ప్రశ్నకు బదులుగా… ఎవరైనే సరే మోసం చేసి ఒకసారి మాత్రమే అధికారంలోకి రాగలరని, ప్రతిసారి రాలేరని చెప్పారు. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితమైనా విలువలు ఉండాలని చెప్పారు.
గుజరాత్ లో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చిందని… దీంతో అక్కడ అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని… నాలుగోసారి కూడా అవుతారని చెప్పారు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అదానీ కాంట్రాక్టులపై ప్రశ్నకు సమాధానంగా… ఆ వ్యవహారం అమెరికా కోర్టులో పెండింగ్ లో ఉందని… కచ్చితమైన సమాచారం వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.