నారద వర్తమాన సమాచారం
భవన నిర్మాణ అనుమతులు ఇక సులభం.. మార్గదర్శకాలు విడుదల
సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేసింది. సీఆర్డీఏ మినహా అన్ని చోట్లా అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 300 చదరపు మీటర్లు మించని నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులు చేశారు. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసేలా అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. కేవలం నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ చేసేందుకు నిబంధనలను సరళతరం చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకే భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఆన్ లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నా సంబంధిత భవనాల యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.