నారద వర్తమాన సమాచారం
మహా శివరాత్రికి ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచండి కోటప్పకొండ ఈవో ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
మహా శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కోటప్ప కొండపై ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోటప్పకొండ ఈవోను ఆదేశించారు. ప్రసాద వితరణ కేంద్రాల సంఖ్య పెంచితే దైవ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు కొండపైనే ఎక్కువ సేపు ఉండాల్సిన అవసరం తగ్గించి జన సందోహాన్ని అదుపులో ఉంచవచ్చన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని బీర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు తిరునాళ్లలో ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారి సేవల గురించి భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమయ్యే సమాచారం అందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు.
కొండ మీద మొబైల్ నెట్వర్క్ అందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గంలో కోతుల బెడద నివారించి మార్గం ఆసాంతం చక్కటి లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
పరిసర గ్రామాల నుంచి వచ్చే ప్రభల మార్గంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు లేకుండా చూడాలని, కొండపైన అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ కంచి శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరె, డీఆర్వో మురళి, కోటప్పకొండ దేవాలయం ఈఓ జిఏవీ శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ లు కోటప్పకొండకు చేరుకుని అధికారులకు సూచనలు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.