నారద వర్తమాన సమాచారం
మంగళగిరి కొండపైకి వెళ్లే భక్తులకు శుభవార్త …త్వరలో బస్సు సేవలు ప్రారంభం
ప్రైవేట్ వాహనాల దోపిడీకి అడ్డుకట్ట!.నారా లోకేష్ సహకారంతో భక్తులకు ఊరట.
నారా లోకేష్ సహకారంతో భక్తులకు ఊరట.
మంగళగిరి
ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం రోజురోజుకు అభివృద్ధిని సంతరించుకుంటొంది. భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా దీనికి తగినట్లుగా వసతులను కల్పిస్తున్నారు. ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రూ. 100 కోట్లతో మంగళాద్రి క్షేత్రంలోని నృసింహాలయాల అభివృద్ధికి అధికారులు అంచనాలు రూపొందించారు. భక్తుల తాకిడి పెరిగిన నేపథ్యంలో కొండపైకి బస్సు వసతిని ఏర్పాటు చేస్తే భక్తులకు ప్రయోజనంగా ఉంటుందని పలు విజ్ఞప్తులు వచ్చాయి. ప్రస్తుతం ఆటో వాలాలు ఒక్కో భక్తుని నుండి కొండపైకి చేరుకునేందుకు రూ.30 నుండి 40 వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ రెండు మినీ ఎలక్ట్రిక్ బస్సులను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో తొలి విడతగా కొండపైకి ఒక బస్సు ప్రారంభం కానున్నట్లు ఈఓ అన్నపరెడ్డి రామకోటిరెడ్డి సోమవారం ఆంధ్ర పత్రిక ప్రతినిధికి తెలిపారు. వచ్చే నెలలో మరో బస్సు అందుబాటులోకి వస్తుందని అన్నారు. నారా లోకేష్ సహకారంతో బస్సు సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. నామమాత్రపు చార్జీలను వసూలు చేయాలా లేదా ఉచితంగా బస్సు సేవలను భక్తులకు అందుబాటులో తీసుకు రావాలా అన్నదానిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సాకారం అయితే ప్రైవేట్ వాహనాల దోపిడీకి అడ్డుకట్ట పడటంతో పాటు ఆలయ అభివృద్ధి మరో అడుగు ముందుకు పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.
పానకం దోపిడీకి అడ్డుకట్ట
నారా లోకేష్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళగిరిలో పానకం దోపిడీకి అడ్డుకట్ట పడింది. గతంలో ఒక బిందె పానకం రూ 70 కు విక్రయించేవారు. దీనిపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఆదేశాలతో పానకం ధరను కేవలం రూ.30 గా నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించారు. ఈ పరిణామంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
టోల్ చార్జీల పైనా దృష్టి పెడితే..!
కొండపైకి చేరుకునే ప్రారంభంలో టోల్గేట్ ఏర్పాటు చేశారు. కారుకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన సొమ్ము దేవస్థానానికి చేరుతుంది. ఒక్కో వాహనానికి రూ. 50 వసూలు చేయటంపై పలువురు భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. టోల్ చార్జీలను పూర్తిగా మినహాయించకపోయినా అందరికీ అనువుగా ఉండేలా ధరను నిర్ణయిస్తే బాగుంటుందని పలువురు భక్తులు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.