Wednesday, March 12, 2025

రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తీసుకొస్తాం.. ఎస్ఆర్ఎం వర్శిటీలో జరిగిన వర్క్ షాపులో సీఎం చంద్రబాబు

నారద వర్తమాన సమాచారం

రాష్ట్రానికి అత్యున్నత విద్యాసంస్థలను తీసుకొస్తాం.. ఎస్ఆర్ఎం వర్శిటీలో జరిగిన వర్క్ షాపులో సీఎం చంద్రబాబు

యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి

ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో 700 కోట్ల పనులకు శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు చేసిన సీఎం

ఎస్ఆర్ఎంకు అదనంగా 200 ఎకరాల భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలను, విద్యాసంస్థలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాలను కొనసాగించి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు, పరిస్థితులు మారిపోయేవని అన్నారు. రాజధానిలో త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మంగళవారం పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు తొలుత యూనివర్సిటీలో రూ.700 కోట్ల భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో విద్యార్థులు, మేధావులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.

30 శాతం ఐటీ ఉద్యోగులు తెలుగువారే

‘1995లో ఐటీ గురించి ఆలోచించి హైదరాబాద్‌కు కంపెనీలు తీసుకొచ్చాను. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ ఆదాయం ఆర్జించేది భారతీయులే. విదేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో 30 శాతం మంది మన తెలుగువారే ఉన్నారు. నేను నిత్య విద్యార్థిని. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటా. గతంలో జనాభా పెరుగుదల మన దేశానికి పెద్ద సమస్యగా ఉంది. జనాభా పెరుగుదల వల్ల అనేక సమస్యలు వస్తాయని అనుకున్నాం, అప్పటి పరిస్థితులను బట్టి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం ఒక సవాలుగా మారుతోంది. చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలలో జనాభా తగ్గుదల అన్నది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. అందుకే జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టాలని కోరుతున్నా. గతంలో ఇద్దరు పిల్లలను కంటే ప్రసూతి సెలవులు ఇచ్చే వారం… ఇప్పుడు ఎంత మందిని కన్నా ప్రసూతి సెలవులను ఇస్తున్నాం. జనాభాను పెంచాలనే ప్రతిపాదనతో ముందుకెళుతున్నాం. భారతదేశం కుటుంబ వ్యవస్థలో బంధం ఉంటుంది. కానీ పరాయి దేశాల్లో నీ పిల్లలు, నా పిల్లలు అన్న విధానం ఉంటుంది’ అని అన్నారు.

అమరావతికి లక్ష కోట్ల పెట్టుబడులు

ప్రధాని మోదీ వికసిత్ భారత్‌తో ముందుకెళుతుంటే మనం విజన్ 2047తో ముందుకెళుతున్నామన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నామని వివరించారు. ప్రస్తుతం 2.58 లక్షలుగా వున్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని, 2047 నాటికి రూ.58 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే 15 శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉందన్నారు. విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన పది సూత్రాల లక్ష్య సాధనకు ప్రభుత్వం ముందుకెళ్తోందని, పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వంతో చేతులు కలపాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉపాధి, ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో లక్షకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రానున్న కాలంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.

హార్డ్‌వర్క్ కాదు… స్మార్ట్‌వర్క్ ముఖ్యం

మహిళలు, యువతకు సాధికారత కల్పించడానికి అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ముఖ్యమని అన్నారు. చదువుకున్న మహిళలు ఇంటి నుంచే పనిచేసి ఉపాధి పొందే మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. మహిళలు మగవారికంటే బాగా పనిచేయగలుగుతారన్నారు. 50 వేల మంది విద్యార్థులకు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని ముందుకు వచ్చి ఎస్ఆర్ఎం హామీ ఇస్తే అదనంగా 200 ఎకరాల భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎస్ఆర్ఎం 10 వేల కుటుంబాలను దత్తత తీసుకుని విద్య, ఉపాధి అవకాశాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. సంపద సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలని, పేదరిక నిర్మూలన లక్ష్యంతో పీ4ను ఉగాది నాడు అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు అత్యున్నత యూనివర్సిటీలను, విద్యా సంస్థలను తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading