నారద వర్తమాన సమాచారం
అభిమానికి స్వయంగా షూ తొడిగి, దీక్ష విరమింపజేసిన ప్రధాని
◆మోదీ ప్రధాని అయ్యేవరకు పాదరక్షలు ధరించనని 14 ఏళ్ల క్రితం శపథం.
●కైథాల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్‌తో యమునానగర్‌లో ప్రధాని భేటీ.
◆రాంపాల్‌కు స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోదీ.
◆ఇలాంటి ప్రతిజ్ఞలు వద్దని, సామాజిక సేవపై దృష్టి పెట్టాలని మోదీ సూచన.
ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఓ వ్యక్తి చూపిన అభిమానం, ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యి, తాను ఆయనను కలిసే వరకు పాదరక్షలు ధరించబోనని 14 ఏళ్ల క్రితం శపథం చేసిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తిని సోమవారం యమునానగర్‌లో ప్రధాని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ ఆయనకు పాదరక్షలు తొడిగి, సుదీర్ఘ ప్రతిజ్ఞకు ముగింపు పలికారు.
హరియాణాలోని కైథాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్‌తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయవద్దు. మీరు పని చేసుకోవాలి, ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు?” అని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ భేటీ గురించి ప్రధాని మోదీ ‘ఎక్స్’ లో కూడా ప్రస్తావించారు. “ఈరోజు యమునానగర్ బహిరంగ సభలో కైథాల్‌కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్‌ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక, నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను – మీ ప్రేమను నేను గౌరవిస్తాను… దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి!” అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.