నారద వర్తమాన సమాచారం
పీఎం సూర్య ఘర్ తో ఇంటింటికీ సోలార్ వెలుగులు : చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
వినుకొండ,
ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం గురించి అవగాహన కల్పించి వినుకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటినీ సోలార్ వెలుగులతో నింపాలని రాష్ట్ర శాసన సభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. గ్రామ గ్రామాన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కూటమి పార్టీల కార్యకర్తలు సైతం సూర్య ఘర్ పథకం గురించి అవగాహన కల్పించడంలో భాగస్వాములు కావాలన్నారు.
సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే 20 ఏళ్ల వరకూ నిర్వహణ సమస్యలు లేకుండా ఉచితంగా విద్యుత్ పొందవచ్చని, మిగులు విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్మడం ద్వారా ఆదాయం కూడా సంపాదించవచ్చన్నారు.
వినుకొండ నగరవనంలో పచ్చదనం పెంపొందించడం, నియోజక వర్గం కేంద్రం నలువైపులా గ్రామాలకు రోడ్ల అభివృద్ధి, 17 గ్రామాలకు సురక్షిత నీరు అందించే పథకం పునరుద్ధరణ, అటవీ ప్రాంతాల్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వై కన్వెన్షన్ హాలు నందు వినుకొండ నియోజక వర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ,ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, డీఎఫ్వో కృష్ణప్రియ, ఆర్డీవో మధులత మరియు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అటవీ శాఖ, దేవాదాయ శాఖ, పంచాయతీ రాజ్, రోడ్లు & భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖ, డ్వామా తదితర శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ 2014-19 కాలంలో పంచాయతీ రాజ్ శాఖలో పనులకు సంబంధించిన నిధుల విడుదలపై నెలరోజుల్లోగా స్పష్టత వస్తుందన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ ఆర్వోఎఫ్ఫార్ పట్టాలు పొందిన రైతులకు పీఎం కిసాన్ పథకం అందించడంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు. వేసవిలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించి ప్రజలకు తాగు నీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సమావేశంలో చర్చించిన నియోజక వర్గ సమస్యలను తర్వాతి నియోజకవర్గ స్థాయి సమావేశం నాటికి పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.