నారద వర్తమాన సమాచారం
మావోయిస్ట్ అగ్రనేతల మృతదేహాల తరలింపునకు ఎస్పీ అడ్డంకులు
అమరావతి,
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్ట్ అగ్రనేతలు నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్, నవీన్‌ల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోమ్ మంత్రి వంగలపూడి అనితలకు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనితలకు రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి చిట్టీ బాబు, చిలుకా చంద్రశేఖర్ లేఖ రాశారు.
వీరిద్దరి మృత దేహాలను స్వస్ధలాలకు తీసుకురావటానికి గత మూడు రోజులగా వారి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో నంబాల కేశవరావు కుటుంబ సభ్యులను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ లేఖలో వారు వివరించారు. కేశవరావు మృతదేహం కోసం ఛత్తీస్‌గఢ్‌లో గురువారం ఉదయం అతడి సోదరుడు వేచి ఉన్నారని తెలిపారు. అయితే బస్తర్ ఐజీ సుందర్ రాజ్‌తోపాటు శ్రీకాకుళం ఎస్పీ.. అతడిని బలవంతంగా వెనక్కి పంపారని ఆ లేఖలో స్పష్టం చేశారు.
మరో మృతుడు నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి కేశవరావు సోదరుడు జిల్లా ఎస్పీని కలిసి దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడినా.. మృతదేహాలను తీసుకు వచ్చేందుకు నిరాకరించారని తెలిపారు. అంతేకాకుండా.. నాటి నుంచి వారి మీద నిఘా ఉంచడమే కాకుండా.. గృహ నిర్బందంలో ఉంచారని ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే మృతదేహాల కోసం శుక్రవారం హైకోర్టును ఆశ్రయిస్తే.. ఈ విషయం తెలియడంతో ఉన్నతాధికారులు.. కింది స్థాయి పోలీసు అధికారుల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోనే వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటూ వారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారని వివరించారు.
మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ పోలీసుల ద్వారా ఆ మృతదేహాలను తీసుకుని అంత్యక్రియలు నిర్వహించు కోవచ్చని వారి రక్త సంబంధీకులకు ఉత్తర్వులు సైతం జారీ చేసిందన్నారు. కానీ ఆ ఉత్తర్వుల్లో రంధ్రాన్వేష చేస్తూ .. వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆ లేఖలో పౌర హక్కుల సంఘం నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే వారి మృతదేహాలను తీసుకురావటానికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్‌ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. పై అంశాలన్నీ మీకు తెలుసునని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ఎందుకంటే ఏపీ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులందరు తమ తమ వాదనలు విన్న అనంతరం ఈ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసిందని ఈ సందర్భంగా ఆ లేఖలో వారు గుర్తు చేశారు.
మనిషి మరణాంతరం అతనికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలను బంధువులు, సన్నిహితులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. అటువంటి వాటిని నిరాకరించేలా వ్యవహరించడం చట్ట వ్యతిరేకమని ఆ లేఖలో వారు స్పష్టం చేశారు. అంతేకాదు.. నైతికంగా పౌరులు సైతం హర్షించరన్నారు. శ్రీకాకుళం ఎస్ పి తనకు తానుగా యిటువంటి చర్యలకు పాల్పడుతున్నాడంటూ అతడిపై ఆ లేఖలో వారు ఫిర్యాదు చేశారు.
ఎస్పీ ఇలా వ్యవహరించడం వెనుక ఎవరైనా పైఅధికారులు ఉన్నారా? లేక రాజకీయ జోక్యంతో ఆయన ఇలా చేస్తున్నారా? అనే అంశాలను కనుగొని.. ఈ సమస్యను సున్నీతంగా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత వంగలపూడి అనితను ఈ లేఖ ద్వారా ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు కోరారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.