నారద వర్తమాన సమాచారం
మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు
ఛత్తీస్‌గఢ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ అలియాస్ వివేక్ మృతదేహం కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంతవరకు మృతదేహాలను పోలీసులు వారి బంధువులకు అప్పగించలేదు. రాకేష్ స్వగ్రామం హసన్ పర్తి మండలం, చింతగట్టు. నంబాల కేశవరావు సహా మిగిలిన వారి మృతదేహాలను ఛత్తీస్ గఢ్ పోలీసులు ఇవ్వలేదు. మృతదేహాల కోసం వారి బంధువులు ఐదు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు.
కేశవరావు మృత దేహం తరలింపులో అడ్డంకులు
ఛత్తీస్‌గఢ్‌లో గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానివ్వకుండా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని పౌరహక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు లేఖ రాశారు. కేశవరావు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన బంధువులు చేస్తున్న ప్రయత్నాలకు ఎస్పీ ఆటంకాలు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ వెళ్లిన కేశవరావు సోదరుడిని ఎస్పీ బలవంతంగా వెనక్కి రప్పించారని తెలిపారు. అంతేకాకుండా అప్పటి నుంచి వారిపై నిఘా పెట్టడంతో పాటు గృహ నిర్బంధం విధించినట్లు తెలిపారు. కేశవరావు బంధువులు కోర్టును ఆశ్రయించారని తెలిసిన ఎస్పీ.. కిందిస్థాయి పోలీసు అధికారుల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. కాగా, అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మవోయిస్టు భూమిక అలియాస్ వన్నాడ విజయలక్ష్మి (38)మృతదేహాన్ని అప్పగించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు నిరాకరించారు. ఆదివారం భూమిక తండ్రి వన్నాడ సాయిలుతో పాటు సమీప బంధువులు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. అయితే భూమిక మృతదేహం అప్పగింతపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారని వారు తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో కర్నూలు మహిళ మృతి
అబూజ్‌మడ్‌లో ఈ నెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయుస్టుల్లో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల లలిత (45) అలియాస్ సంగీత కూడా ఉన్నారు. ఆమె మృతిపై ఆలస్యంగా సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం కోసం వెళ్లిన లలిత.. దళిత హక్కుల కోసం కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్)లో పనిచేశారు. ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. 20ఏళ్లకు పైగా కుటుంబ సభ్యులతో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవని, మావోయిస్టు పార్టీ పిలుపుతో దండకారణ్యంలో ఆదివాసీలకు నర్సుగా సేవలు చేసేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.