నారద వర్తమాన సమాచారం
నెలకు రెండుసార్లు రుణ మేళా: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
రుణాల కోసం బ్యాంకులను మాత్రమే ఆశ్రయించండి: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
కలెక్టరేట్ లో మెగా రుణ మేళా ద్వారా 50 మందికి రుణాల మంజూరు
నరసరావు పేట,
జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా రుణ మేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో ఒకసారి, నియోజక వర్గ స్థాయిలో ఒకసారి రుణమేళా నిర్వహించి బ్యాంకు రుణాలు సులభంగా పొందడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. బ్యాంకులకు అందిన రుణ దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి రుణ వితరణ చేపడతామన్నారు.
సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో బ్యాంకర్లు, రుణ దరఖాస్తుదార్లతో మెగా రుణ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 338 దరఖాస్తులను పరిశీలించి, 50 మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.50 లక్షలు స్వయం సిద్ధ రుణాలు మంజూరు చేశారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద మరో రూ.32 లక్షలు మంజూరు చేశారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రుణాల కోసం బ్యాంకును మాత్రమే ఆశ్రయించడం అన్ని విధాలా శ్రేయస్కరమన్నారు. వివిధరకాల డాక్యుమెంట్లు సమర్పించడం సాధ్యం కాదని, రుణం పొందడం ఆలస్యం అవుతుందనే ఆలోచనలతో చాలా మంది బ్యాంకులకు బదులుగా బయట వ్యక్తుల వద్ద ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుని రుణభారంతో సతమవుతున్నారన్నారు. బ్యాంకులు రుణాలు అందించేందుకు ఉన్నాయని, ప్రభుత్వ పథకాల ద్వారా అందించే బ్యాంకు రుణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్డీఎం రామ్ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, యూనియన్ బ్యాంకు ప్రాంతీయ అధిపతి మాధురి, ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ అధిపతి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.