నారద వర్తమాన సమాచారం
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు.. తొలిసారి క్రెడిట్ వదులుకున్న ట్రంప్
గత నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భయపడ్డారు. అయితే అంత దూరం వెళ్లకుండా ఇరు దేశాల అధినేతలు సంయమనం పాటించి కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపించానని అప్పట్నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా అదే పాట పాడుతూ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రకనటపై తాజాగా స్పందించిన భారత ప్రధాని మోదీ .. కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ట్రంప్‌తో కూడా మోదీ మాట్లాడినట్టు ప్రకటన వెలువడింది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్‌కు ట్రంప్ విందు ఇచ్చారు. ఆ విందు అనంతరం ఓవల్ ఆఫీస్‌లో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశంలో ట్రంప్ అసలు నిజం వెల్లడించారు. ‘భారత్-పాకిస్థాన్ అధినేతలు యుద్ధాన్ని కొనసాగించకూడదని తెలివైన నిర్ణయం తీసుకున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం మంచిది కాదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపడంలో తన పాత్ర గురించి ట్రంప్ చెప్పుకోకపోవడం ఇదే తొలిసారి. అలాగే భారత్, పాకిస్థాన్‌లతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు కూడా ట్రంప్ ఈ సమావేశంలో వెల్లడించారు. కాగా, తమ వ్యవహారాల్లో ఇతరులు జోక్యాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తాను స్వయంగా ట్రంప్‌నకు కూడా ఫోన్‌లో చెప్పానని మోదీ తెలిపారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







