నారద వర్తమాన సమాచారం
ఆ మూడు పాటిస్తేనే సంబంధాలు: చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ సూటి సందేశం
ఢిల్లీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జైశంకర్ చర్చలు
నిజాయితీతో కూడిన నిర్మాణాత్మక వైఖరి అవసరమని స్పష్టీకరణ
పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాల ఆధారంగా బంధం కొనసాగాలని వ్యాఖ్య
భారత్, చైనా మధ్య సంబంధాలు ముందుకు సాగాలంటే నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక వైఖరి అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాల (3ఎం) ఆధారంగానే ఇరు దేశాల బంధం కొనసాగాలని ఆయన అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సోమవారం జైశంకర్ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, “మన మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదు. అదేవిధంగా, పోటీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘర్షణకు దారితీయకూడదు” అని చైనా మంత్రికి సూటిగా వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను సంయుక్తంగా కాపాడగలిగినప్పుడే సంబంధాలలో సానుకూల పురోగతికి ఆధారం ఏర్పడుతుందని ఆయన నొక్కిచెప్పారు. సరిహద్దుల్లో సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముందుకు సాగడం అత్యంత ఆవశ్యకమని జైశంకర్ పునరుద్ఘాటించారు.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగిస్తున్నామని, చైనా భూభాగం గుండా కైలాస పర్వతం, మానస సరోవర్ యాత్రలకు అనుమతించామని వాంగ్ యీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరస్పర ప్రయోజనాలకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ కానున్నారు.
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల అనంతరం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి తూర్పు లడఖ్ లో నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, సంబంధాలను గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ భేటీ జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.