నారద వర్తమాన సమాచారం
మాచర్లలో పశువుల శాల నిర్మాణానికి చర్యలు తీసుకోండి : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావు పేట,
ముఖ్యమంత్రి మాచర్ల పర్యటనలో ఇచ్చిన పశువుల హాస్టల్ నిర్మాణం హామీ సాకారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మాచర్లలో పశువుల హాస్టల్ ఏర్పాటు, జిల్లాలో నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.
హాస్టల్ లో పశువుల సంఖ్య ఆధారంగా నిర్మాణ ప్రణాళిక తయారు చేయాలని మాచర్ల మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. హాస్టల్ కోసం స్థల సేకరణ చేపట్టాలని తహసీల్దార్ కిరణ్ ను ఆదేశించారు. కుటుంబ నివాసాలకు దూరంగా హాస్టల్ ఉండేలా చూడాలన్నారు.
కేంద్రీయ విద్యాలయానికి తాత్కాలిక భవనం అప్పగించండి
జిల్లా కేంద్రం నరసరావు పేట సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు అన్ని వసతులతో కూడిన తాత్కాలిక భవనం అప్పగించాలని డీఈవో చంద్రకళను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. జిల్లాలో కేంద్రీయ విద్యాలయం కోసం 5 నుంచి 10 ఎకరాల అనువైన స్థలం సేకరించాలన్నారు.
మాచర్లలో ప్రతిపాదన దశలో ఉన్న మరో కేంద్రీయ విద్యాలయానికి నీటి సరఫరా అందించే విషయంలో సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో మురళి, ఆర్డీవోలు రమణాకాంత్ రెడ్డి, మురళీ కృష్ణ, డీఈవో చంద్రకళ, తహసీల్దార్లు వేణుగోపాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.