నారద వర్తమాన సమాచారం
అమెరికాకు భారత విద్యార్థులు దూరం… భారీగా తగ్గిన వీసాలు
అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్యలో భారీ తగ్గుదల
ఆగస్టులో 44.5 శాతం తక్కువగా జారీ అయిన స్టూడెంట్ వీసాలు
ట్రంప్ ప్రభుత్వ కఠిన విధానాలే కారణమని ఆందోళన
మరోవైపు భారత విద్యార్థులను ఆకర్షిస్తున్న ఫ్రాన్స్
2030 నాటికి 30 వేల మంది విద్యార్థులే లక్ష్యంగా ఫ్రాన్స్ ప్రణాళిక
ఢిల్లీ, చెన్నైలలో ‘చూజ్ ఫ్రాన్స్ టూర్-2025’ కార్యక్రమాలు
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాల సంఖ్యను భారీగా తగ్గించింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 44.5 శాతం తక్కువ వీసాలు మంజూరు చేయడంతో అమెరికాలో చదువుకోవాలన్న ఎందరో విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో అమెరికా జారీ చేసిన మొత్తం అంతర్జాతీయ విద్యార్థి వీసాలు 19.1 శాతం తగ్గాయి. అయితే దీని ప్రభావం భారత్‌పైనే అత్యధికంగా పడింది. ఇదే సమయంలో చైనాకు 86,647 వీసాలు జారీ కాగా, భారత్‌కు అందులో సగం కంటే తక్కువగానే వీసాలు దక్కాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసాల రద్దు, ఇంటర్వ్యూల నిలిపివేత, హెచ్-1బీ వీసా రుసుము పెంపు వంటి చర్యలు భారత విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
ఫ్రాన్స్ ఆహ్వానం..
ఒకవైపు అమెరికా భారతీయ విద్యార్థులకు తలుపులు మూస్తుంటే, మరోవైపు ఫ్రాన్స్ వారికి రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 17 శాతం పెరిగింది. 2030 నాటికి ఈ సంఖ్యను 30,000కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్రాన్స్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇందులో భాగంగా ‘చూజ్ ఫ్రాన్స్ టూర్-2025’ పేరుతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తోంది. అక్టోబరు 5న చెన్నైలో, 7న ఢిల్లీలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కోల్‌కతా (అక్టోబరు 9), ముంబై (అక్టోబరు 11) నగరాల్లోనూ జరగనున్నాయి. ఈ టూర్‌లో 50కి పైగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పాల్గొంటున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.