నారద వర్తమాన సమాచారం
శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ
75 ఏళ్ల క్రితం తేదీ 31-1-1950 న నాటి మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ పి.యస్.కుమార స్వామి రాజా, ఆర్థిక మంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గార్లు కొందరు ఇంజనీర్లతో శ్రీశైలం వచ్చి శ్రీ శైల రాజమార్గం ఘాట్ రోడ్డు గురించి ఒక నివేదికను తయారుచేసుకొని వెళ్లారు.
దీనికి నేపథ్యం శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య శివాచార్య మహా స్వాములవారు వారి సహచర మిత్రులు, స్వాతంత్ర్య సమరయోధులైన శ్రీ ప్రకాశ్ గారు మద్రాసు గవర్నర్ గా వచ్చిన విషయం తెలుసుకుని ఆయనకు శ్రీశైల క్షేత్రం యొక్క పరిస్థితిని శ్రీశైలానికి రాజమార్గం అవసరాన్ని గురించి లేఖను రాయడం.శ్రీశైల రాజమార్గ నిర్మాణానికి ఆరోజు మూలబీజం పడింది.అది ఎంతటి సుదినమో గదా!
ఈవిధంగా ప్రారంభమైన శ్రీశైలం రోడ్డు పనులు 1955నుండి1957వరకు ముమ్మరంగా సాగి దోర్నాల నుండి శ్రీశైలం వరకు కొండల మీదుగా కీకారణ్యంలో 49 కిలోమీటర్ల మేరకు కేవలం 69 లక్షల 70వేల రూపాయల వ్యయంతో పూర్తికావడం కూడా విశేషమే.అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు, మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యస్.నిజలింగప్పగారు 24-11-1957 తేదీన ఈ నూతన రాజమార్గానికి ప్రారంభోత్సవం చేశారు.
ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి కీలక పాత్ర కావడమే గాక శ్రీశైలదేవస్థాన అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడింది.ఇంకా చెప్పాలంటే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఈ కరవుప్రాంత ప్రజలకు ఎంతో ఆసరా కల్పించాయి.నాకు తెలిసి మా ఊరి కొందరు కూలీలు ఈ రోడ్డు పనులకు వెళ్లి వాళ్ల పిల్లలను చదివించారు.కొందరు ఉపాధ్యాయులు కాగా ఒకరిద్దరు ఇంజనీర్లు కూడా అయ్యారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







