నారద వర్తమాన సమాచారం
వాషింగ్టన్‌లో సైనికులపై దాడి.. అదనపు బలగాలను దించిన ట్రంప్
వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్
సైనికులపై కాల్పులు
ఈ ఘటనను ఉగ్రదాడిగా అభివర్ణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్‌కు 500 మంది అదనపు సైనికులను పంపాలని ఆదేశం
నిందితుడు ఆఫ్ఘన్ జాతీయుడిగా గుర్తింపు
అమెరికా అధ్యక్ష భవనం
వైట్‌హౌస్‌కు అత్యంత సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘హేయమైన చర్య’, ‘ఉగ్రవాద దాడి’గా అభివర్ణించారు. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తక్షణమే వాషింగ్టన్‌కు అదనంగా 500 మంది సైనికులను పంపాలని పెంటగాన్‌ను ఆదేశించారు.
బుధవారం మధ్యాహ్నం వైట్‌హౌస్‌కు కొన్ని బ్లాకుల దూరంలోనే ఈ దాడి జరిగింది. వెస్ట్ వర్జీనియాకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులు గస్తీ కాస్తుండగా, ఓ దుండగుడు అకస్మాత్తుగా వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో భద్రతా దళాలు వెంటనే వైట్‌హౌస్ కాంప్లెక్స్‌ను లాక్‌డౌన్ చేశాయి. కాల్పుల సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో క్లబ్‌లో ఉన్నారు.
భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని 29 ఏళ్ల రెహమానుల్లా లకన్‌వాల్‌గా గుర్తించారు. ఇతడు 2021లో తాలిబన్లు అధికారం చేపట్టాక ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అమెరికా సైన్యానికి సహాయం చేసిన అఫ్ఘన్లకు ఇచ్చే ప్రత్యేక వీసాపై వచ్చిన ఇతడు, వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. గత బైడెన్ ప్రభుత్వమే నిందితుడిని దేశంలోకి అనుమతించిందని ఆరోపించారు. నరకంలాంటి అఫ్ఘనిస్థాన్ నుంచి అతడిని తీసుకొచ్చారని విమర్శించారు. బైడెన్ హయాంలో ఆఫ్ఘన్ నుంచి వచ్చిన శరణార్థులందరి వివరాలను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







