నారద వర్తమాన సమాచారం
గుట్కా, పాన్ మసాలా పరిశ్రమపై కేంద్రం కొరడా.. రాబోతున్న కొత్త చట్టం!
గుట్కా, పాన్ మసాలా పరిశ్రమపై కొత్త చట్టం తెస్తున్న కేంద్రం
ఉత్పత్తి పై కాకుండా యంత్రాల సామర్థ్యం ఆధారంగా పన్ను విధింపు
నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలు
సిగరెట్ల పై కూడా సెస్సు విధానంలో కీలక మార్పులకు సన్నాహాలు
దేశంలో పెద్దగా నియంత్రణ లేని గుట్కా, పాన్ మసాలా పరిశ్రమను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక చట్టాన్ని తీసుకురాబోతోంది. ‘హెల్త్ సెక్యూరిటీ టు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
ఈ కొత్త చట్టం ప్రకారం, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించే విధానం పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు తుది ఉత్పత్తి ఆధారంగా పన్ను విధిస్తుండగా, ఇకపై వాటి తయారీకి ఉపయోగించే యంత్రాల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక సెస్సు విధించనున్నారు. చేతితో తయారుచేసే యూనిట్లకు కూడా ప్రతినెలా తప్పనిసరిగా నిర్దిష్ట మొత్తంలో సెస్సు చెల్లించాల్సి ఉంటుంది.
నిబంధనలు కఠినతరం
ఈ కొత్త విధానంలో, ఉత్పత్తి ఎంత జరిగిందనే దానితో సంబంధం లేకుండా ప్రతి నెలా తయారీదారులు సెస్సు చెల్లించాలి. ఒకవేళ యంత్రాలు లేదా యూనిట్ 15 రోజులకు మించి పనిచేయకపోతే మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ప్రతి తయారీదారు తప్పనిసరిగా ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి, నెలవారీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అధికారులు ఎప్పుడైనా తనిఖీలు, విచారణ, ఆడిట్ చేసేందుకు వీలు కల్పించాలి. ఈ నిబంధనల ఉల్లంఘనకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే సెస్సును రెట్టింపు చేసే అధికారాన్ని కూడా ప్రభుత్వం తన వద్దే ఉంచుకోనుంది.
ధరలపై ప్రభావం ఉండదు
మరోవైపు, సిగరెట్లపై ఉన్న జీఎస్టీ పరిహార సెస్సును కూడా కేంద్ర ఎక్సైజ్ చట్టం పరిధిలోకి మారుస్తూ మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అయితే, ఈ మార్పుల వల్ల గుట్కా, పాన్ మసాలా లేదా సిగరెట్ల ధరలపై వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లలో ఎటువంటి మార్పు ఉండదని, కేవలం పన్నుల వసూలు విధానాన్ని క్రమబద్ధీకరించి, పారదర్శకత పెంచడమే లక్ష్యమని వివరించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







