నారద వర్తమాన సమాచారం
నారా లోకేష్ బిజినెస్ మ్యాజిక్!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక స్వర్గధామంగా మారుతోంది. జగన్ ఐదేళ్ల విధ్వంసకర పాలనలో మందగించిన పెట్టుబడుల ప్రవాహం, నమ్మకం కోల్పోయిన పెట్టుబడిదారుల పరిస్థితుల నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఫోర్బ్స్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఏకంగా 25.3 శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కడం చిన్న విషయం కాదు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి పారిశ్రామిక దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టి ఏపీ అగ్రస్థానంలో నిలవడం నారా లోకేష్ అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితం.
లోకేష్ స్మార్ట్ ప్రయత్నాలు – ఇన్వెస్టర్లకు నమ్మకం
రాష్ట్రానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడంలో నారా లోకేష్ స్మార్ట్ గా ప్రయత్నించారు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు విధానాలను మార్చుకున్నారు. గూగుల్, అదానీ, రిలయన్స్, ఆర్సెలార్ మిత్తల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఏపీకి రప్పించేందుకు ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షించడం, ఇన్వెస్టర్లతో స్వయంగా సంప్రదింపులు జరపడం రాష్ట్రానికి కలిసివచ్చింది.
నమ్మకం కలిగించిన లోకేష్ మార్క్
గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయపెట్టేలా వ్యవహరించడంతో దెబ్బతిన్న రాష్ట్ర ప్రతిష్టను లోకేష్ తన ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ స్వభావంతో మళ్లీ నిలబెట్టారు. గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజం విశాఖలో తన డేటా సెంటర్ , ఏఐ హబ్ ఏర్పాటు చేసేలా చేయడంలో ఆయన విదేశీ పర్యటనలు, పారిశ్రామికవేత్తలతో జరిపిన వన్-టు-వన్ సమావేశాలు కీలక భూమిక పోషించాయి. ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు , 21 రోజుల్లోనే సింగిల్ విండో అనుమతులు ఇచ్చే విధానం పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని రెట్టింపు చేశాయి.
చంద్రబాబు బ్రాండ్ – లోకేష్ వర్కింగ్ స్టైల్
చంద్రబాబు నాయకత్వంపై పారిశ్రామికవర్గాల్లో మంచి అభిప్రాయం ఉంటుంది. వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. అయితే జగన్ భయం వారిని వెంటాడుతూ ఉండటం ఈ సారి అత్యంత కీలకమైన అంశం. వారిలో నమ్మకాన్ని పెంచి.. జగన్ మళ్లీ రారు అనే నమ్మకాన్ని కలిగించి పెట్టుబడులు తెస్తున్నారు. అంటే ఓ పెద్ద గుదిబండను కట్టుకుని పరుగులు తీస్తున్నారన్నమాట. అయినా ఎక్కడా తగ్గడం లేదు. 2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోందని, లోకేష్ పట్టుదల చూస్తుంటే రాష్ట్రం త్వరలోనే 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్
పెట్టుబడుల ఆకర్షణతో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. కేవలం ఫ్యాక్టరీలు రావడం మాత్రమే కాకుండా, స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించి వారిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నారా లోకేష్ విజన్ , దూకుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఊహించనంత మార్పు తీసుకు వస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







