భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారి జేబుల్లో కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని తిరుగుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం పోచంపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దవాఖానకు కారు కార్ఖానా వెళుతుందని చెప్పారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ఖేల్ కతం అయింది అని అన్నారు. హరీష్ రావుకు ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేయకుంటే మీ మామ కేసీఆర్ తల నరుక్కుంటాను అన్నాడని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి ఎటుపాయే అని ప్రశ్నించారు.
2009లో తనను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారని, 2019లో అన్న వెంకట్రెడ్డిని గెలిపించారని, 2024లో తన తమ్ముడు చదువుకున్న వ్యక్తి యువ నాయకుడు గత 20 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన సేవకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భీమనపల్లి చెరువు తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేశానని, 2012లో కరువు వచ్చి పశువులకు పశుగ్రాసం లేక త్రాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే తన సొంత ఖర్చులతో అందించినట్లు తెలిపారు. రైతు బిడ్డగా చెబుతున్నానని గోదావరి జలాలతో బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా పోచంపల్లి రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు. పేద మహిళలను, యువకులను, రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. రాజకీయాలు మానవత్వంతో చేయాలని కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టకూడదన్నారు. అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూసే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కవిత తీహార్ జైల్లో ఉంది కేసీఆర్, కేటీఆర్ కూడా త్వరలో జైలుకెళ్లడం ఖాయం అన్నారు. 10 సంవత్సరాలు అబద్దాలతో మాయమాటలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని అప్పులు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.