నారద వర్తమాన సమాచారం
జూన్ :04
కౌంటింగ్ కేంద్రాలపై ప్రతిక్షణం ఈసీ నిఘా ఉండాలి: ప్రత్తిపాటి, లావు
అత్యంత ఉత్కంఠభరితంగా మారిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రతిక్షణం ఎన్నికల సంఘం పటిష్ఠ నిఘా ఉండాలని విజ్ఞప్తి చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎన్ని పగడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కొందరు అధికారులు అధికార వైకాపా బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గే ప్రమాదం ఉందని, అలాంటి చోట్ల ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే నిజాలు సమాధి కాకుండా ఈసీ ముందు జాగ్రత్తలు, ప్రత్యమ్నాయ నిఘా ఏర్పాటు చూసుకోవాలని వారిద్దరు కోరారు. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాతో పాటు సమస్యాత్మక కేంద్రాలన్నింటి వద్ద ఈ జాగ్రత్తలు తప్పనిసరన్నారు. ఇప్పటికే వైకాపా ముఖ్య నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, బెదిరింపుల నేపథ్యంలో ఇది చాలా కీలకమన్నారు ప్రత్తిపాటి, లావు. అలానే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఆయా బూత్‌లకు ఏజెంట్లుగా ఉన్నవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇరువురు నేతలు సూచించారు. ఈ మేరకు సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో కౌంటింగ్ కేంద్రాల ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ కౌంటింగ్‌కు వెళ్తున్న సభ్యులు ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు, నియమావళిని తప్పక పాటించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెంట్లకు ఈసీ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అనుమానం వస్తే వెంటనే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. వైకాపా నుంచి ఎవరైనా రెచ్చగొట్టాలని చూసినా సంయమనం పాటించి వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేయాలన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తమంగా ఉండాలన్నారు. లెక్కింపు రోజున సమయానుకూలంగా ఏజెంట్లు కేంద్రాల వద్దరు చేరుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు కౌంటింగ్ పూర్తిగా ముగిసి అభ్యర్థులంతా గెలుపు డిక్లరేషన్లు అందుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని లావు కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.