నారద వర్తమాన సమాచారం
జూన్ :14
దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులు పెరుగుతున్న ఉల్లి ధరలు.. కొనేముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్రగామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు వంటి పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత రెండు వారాలలో ఉల్లి ధరలు 30 నుంచి 50 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి.. ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారని, అలా ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
హైదరాబాద్‌లో ఉల్లిపాయల ధరల విషయానికి వస్తే.. రిటైల్ ధర సుమారు 25 శాతం, హోల్‌సేల్ ధర 15 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఉల్లి రిటైల్ ధరలు కిలో రూ. 20 ఉండగా.. హోల్‌సేల్ ధర క్వింటాల్‌కు రూ.1,581.97గా ఉంది. ప్రస్తుతంరిటైల్ ధరలు కిలోకు రూ. 40 నుంచి రూ. 50 మధ్య ఉంది. ఒక నెల క్రితం ఉల్లి కిలో ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. అయితే జూన్ 17న బక్రీద్ నేపథ్యంలో ఉల్లిపాయలకు దేశీయంగా భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు సెప్టెంబరు, అక్టోబరు వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60 దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, దేశంలోని ఉల్లిలో 42 శాతానికి పైగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర.. తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో 15 నుంచి 20 శాతం తగ్గుదలని చవిచూసింది. మహారాష్ట్రలోని 27 జిల్లాలలో 20 నుంచి 45 శాతం వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయని గణంకాలు సూచిస్తున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.