నారద వర్తమాన సమాచారం
జూన్ :23
అమరావతి
ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు
రాష్ట్ర శాసన సభలో పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే విచ్చేసిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు.
ఈ సందర్భంగా శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది పవన్ కళ్యాణ్ కి తమ సమస్యలను చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు. అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు రూ.2500 భత్యం వచ్చేదని.. తరవాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ.. పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.