అక్షర యోధుడు పద్మవిభూషన్ రామోజీరావుకు గుంటూరులో ఘన నివాళులు
గుంటూరు,
జులై 7:
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన
అక్షరయోధులు రామోజీరావు.
-లోక్ సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజావిజయానికి కృషి చేసిన అక్షరయోధులు రామోజీరావు అని నరసరావుపేట లోక్ సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.ఈనెల 7వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక మరియు ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షరయోధులు రామోజీరావు సంస్మరణ సభ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా లావు
శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు రామోజీరావు అని,కృష్ణాజిల్లాలోని
పెదపారుపూడిలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు.నేటి యువత రామోజీరావు నిబద్ధత,దృఢ సంకల్పం,క్రమశిక్షణ లను అలవర్చుకోవాలని కోరారు.సమాజ రుగ్మతులపై నిరంతరం పోరాడిన సామాజిక విప్లవకారుడు రామోజీరావు అని తెలిపారు.అవనిగడ్డ శాసనసభ్యులు,మాజీ మంత్రివర్యులు,డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తూ రామోజీ ఈనాడు,ఈటీవీల ద్వారా తెలుగు భాష ఉద్యమానికి ఎనలేని కృషి చేశారన్నారు.తెలుగు భాష మృతభాషగా మారుతున్న సమయంలో తెలుగు భాష వికాశానికి సర్వశక్తులు వినియోగించారన్నారు.కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ యన్.తులసిరెడ్డి ప్రసంగిస్తూ రామోజీ నిరంతర శ్రమజీవి అని,స్వాప్నికుడని, ధన్యజీవి అని కొనియాడారు.పాడుతా తీయగా ప్రోగ్రామ్ ద్వారా వందలాది గాయకులను ప్రోత్సహించినారన్నారు.సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రామోజీ కుటుంబం 120 కోట్ల రూపాయల విరాళాలను అందించి ఆపద సమయాలలో ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు.25 వేల మందికి ప్రత్యక్షంగా మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన రామోజీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.అన్నదాత పత్రిక ద్వారా రైతాంగానికి ఆధునిక పద్ధతులను నేర్పుతున్నారని,ప్రతిఘటన,మయూరి లాంటి సందేశాత్మకమైన చిత్రాలను అందించారన్నారు.మార్గదర్శి చిట్ ఫండ్స్ పై 2006 నుండి రాజకీయ పెద్దలు విష ప్రచారం చేసినా వాటన్నిటిని ఎదుర్కొన్న ధిశాలి రామోజీరావు అని తెలిపారు.1990 దశాబ్దంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి,సారా వ్యతిరేక ఉద్యమానికి ఊతమిచ్చిన సామాజిక స్పృహ గల మహా మనిషి రామోజీ అని కొనియాడారు.శాసనమండలి సభ్యులు కే.ఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ రామోజీ తన తుది శ్వాస విడిచేవరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేశారని గుర్తు చేశారు.ఈటీవీ యువ కార్యక్రమాలతో యువత నైపుణ్యాలను పెంపొందించడానికి,మార్గదర్శి కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని మహనీయులను పరిచయం చేయడం అభినందనీయమన్నారు.ఈనాడు సంపాదకులు ఎం.నాగేశ్వరరావు ప్రసంగిస్తూ గత 35 సంవత్సరాలుగా రామోజీరావు గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.క్రమశిక్షణతో కూడిన రామోజీ జీవితం అందరికీ ఆదర్శంగా నిలిచిందని మనిషి ఎదుగుదలకు క్రమశిక్షణ,నిబద్ధత,ధైర్య సాహసాలు ముఖ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య,బిజెపి రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు
వై.వెంకటేశ్వరరావు,మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్,సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు,హైకోర్టు న్యాయవాది పి.రవితేజ తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రామోజీరావు జీవిత విశేషాలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ సభికులను ఆకట్టుకుంది.కార్యక్రమం ప్రారంభంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.రంగం రాజేష్ బృందం రామోజీరావు ప్రాముఖ్యతను వివరించే గేయాలను ఆలపించి సభికులను ఆలోచింపజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.