నారద వర్తమాన సమాచారం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రపంచంలో… భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఉందా….
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది.
పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.
నిజాలు నిర్భయంగా రాసినా, అవినీతి, పర్యావరణ విధ్వంసం, మత మౌఢ్యం వంటి అంశాలు గురించి రాసిన పాత్రికేయులు వేధింపులకు గురవుతున్నారు. రాజకీయ విధేయత ప్రదర్శించకపోయినా ప్రభుత్వాలు పాత్రికేయలను రాచి రంపాన పెడుతున్నాయి. మారుతున్న పరిస్థితులు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో విస్తరిస్తున్న పత్రికల కన్నా హరించుకుపోతున్న సేచ్ఛే ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రజాస్వామ్య దేశాలల్లో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలుస్తాయి. కానీ, అంతటి కీలక వ్యవస్థ (పత్రికా) స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. వివిధ మార్గాలలో మీడియాపై నానాటికీ నియంతృత్వ ధోరణి పెచ్చుమీరుతోంది. పత్రికా స్వచ్ఛ నియంత్రణకు ప్రభుత్వాలు, ఉగ్రవాద సంస్థలు ఆంక్షలు విధిస్తున్నాయి. మీడియాపై దాడులకు తెగిస్తున్నాయి. పత్రికల గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాయి. పాత్రికేయుల రహస్య మూలాల గుర్తింపు బహిర్గతం చేయాలని వారిని వేధిస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో వార్తాపత్రికలు 1,05,443 కంటే ఎక్కువగా ప్రచురితమవుతున్నాయి. రాజ్యాంగంలో పత్రికాస్వేచ్ఛను ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదని, భావ ప్రకటన స్వేచ్ఛలో అది భాగమని బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రవేశిక ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని పేర్కొంటుంది. ప్రాథమిక హక్కుల్లో ప్రకరణ 19(1) వాక్ స్వాతంత్య్ర, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. పత్రికా స్వేచ్ఛ ఈ ప్రకరణ కిందకు వస్తుంది. ప్రకరణ 19(2) ప్రకారం ఈ హక్కుకు హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. అవి, భారతదేశ సార్వభౌమ, అఖండత, దేశ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా శాంతిభద్రతలను కాపాడటానికి, మర్యాద లేదా నైతిక ప్రవర్తన దృష్ట్యా పరువు నష్టం, నేరాలను ప్రోత్సహించడం దృష్ట్యా భావప్రకటన స్వేచ్ఛ అంటే పత్రిక, మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వాలు హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.
పత్రిక, మీడియా స్వేచ్ఛగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మరోవైపు, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి గత ఏడాది నుంచి అత్యంత అధ్వాన్నమైన దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. అంతర్జాతీయ మీడియా పర్యవేక్షణా సంస్థ ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ (ఆర్‌ఎస్‌ఎఫ్) ఇటీవల విడుదల చేసిన జాబితాలో భారత్ కూడా చేరింది. జర్నలిస్టులపై నిఘా వుంచడానికి, వారిని వేధింపులకు గురిచేయడానికి కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించే దేశాల జాబితా ఇది. ప్రపంచ సైబర్ సెన్సార్‌షిప్ వ్యతిరేక దినం సందర్భంగా ఈ జాబితా విడుదల చేశారు. ఈ జాబితా చూస్తే భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్రమైన ప్రమాదం వుందనేది స్పష్టమవుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.