
నారద వర్తమాన సమాచారం
మే :28
ఉడుముల సుధాకర్ రెడ్డి..
ఈ పేరు ఎక్కడో విన్నట్టు, చూసినట్టు ఉంది కదూ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, ప్రైవేటు కంపెనీల అధిపతులకు ఈ పేరు నోటెడ్. అక్రమార్కులు, అవినీతిపరులకు ఈ పేరు చెబితే వణుకు పుడుతుంది. అసలు సిసలైన జర్నలిస్టుకు ప్రతిరూపం ఆయన. నమ్మిన సిద్ధాంతం కోసం వెన్నుచూపని ఓ అసామాన్యుడు. ఆయన కలానికి పదునెక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కాదు దేశవ్యాప్తంగా జర్నలిజం రంగంలో ఈ పేరు సుపరిచితం. ఆయన పనిచేస్తున్న పత్రికలో ప్రతి రోజూ ఆయన పేరుతో (బైలైన్) కథనాలు వస్తుంటాయి. అందుకే ఆ పేరునే టైటిల్‌గా తీసుకున్నాం. అచీవర్స్ స్టోరీస్ సగర్వంగా అందిస్తున్న టెమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ ఉడుముల సుధాకర్ రెడ్డి సక్సెస్ స్టోరీ..
రెండు దశాబ్దాల క్రితం విజయవాడలో లూనా సెంటర్లో ప్రారంభమైన సుధాకర్ రెడ్డి జర్నలిజం ప్రస్థానం లాస్ ఏంజిల్స్ వరకు విస్తరించింది. క్రైమ్, పాలిటిక్స్, వ్యవసాయం, టెక్నాలజీ, బయో టెక్నాలజీ, సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్.. ఇలా ఒక్కటేమిటి.. అన్ని విభాగాల్లో ఆయన కథనాలు ఉంటాయి. వికిలీక్స్ సైతం సుధాకర్ రెడ్డి కథనాలను ఆధారం చేసుకోవడం ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే జ్ఞాపకం. యూఎస్‌లో 2016లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో భారత్ నుంచి ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రాంలో పాలుపంచుకున్న ఏకైక వ్యక్తిగా రికార్డుకెక్కారు. ప్యారడైజ్, పనామా పేపర్లను వెలుగులోకి తెచ్చిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సంస్థలో శిక్షణ పొందారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ నుంచి చీవ్‌నింగ్ ఫెలోషిప్ అందుకున్నారు. ప్రముఖ పత్రిక గార్డియన్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. అవినీతి చట్టాలు–భారత్, బ్రిటీష్ దేశాల్లో వ్యత్యాసాలపై పరిశోధన పత్రం సమర్పించారు.
ఆడపిల్లలకు టాయిలెట్ల అవసరాన్ని తెలుపుతూ రాసిన కథనానికి యూనిసెఫ్ అవార్డూ వరించింది. కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడిగా అయిదేళ్లపాటు సేవలందించారు. పొలిటికల్ రికమండేషన్లు లేకుండా ఈ పదవి దక్కిందంటే జర్నలిజం పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ అర్థం చేసుకోవచ్చు. ఏపీ జీవవైవిధ్య మండలి ఎక్స్‌పర్ట్ కమిటీలో సభ్యుడిగా, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల బోర్డ్ ఆఫ్ అకాడమిక్ స్టడీస్‌లో సభ్యుడిగానూ పనిచేశారు. వివిధ యూనివర్సిటీలు, జర్నలిజం కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్‌గా విశేష సేవలు అందిస్తున్నారు. వృత్తిలో భాగంగా 15 దేశాలు చుట్టివచ్చారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి బీసీజే, తెలుగు, ఇంగ్లీషు బాషలో ఎంసీజే పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌బీ, ఎంసీఏ, ఎంఏ రిలీజియస్ స్టడీస్ చదివారు. ఎన్‌ఐఐటీ నుంచి కంప్యూటర్ కోర్సు చేశారు. మెడిసిన్‌లో ఫెయిల్యూర్ స్టోరీని ఇలా డిగ్రీల ద్వారా సక్సెస్ స్టోరీగా మల్చుకున్నారు.
సుధాకర్ రెడ్డి స్వస్థలం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జగన్నాథపురం. నిజాం పాలించిన జుజ్జూరుఖనన్ ప్రాంతం ఇది. సుధాకర్ తండ్రి ఉడుముల రాయపరెడ్డి సన్నకారు రైతు. తల్లి జాస్ఫినమ్మ గృహిణి. మధ్యతరగతి కుటుంబం. కూలీలతోపాటు సుధాకర్ తల్లిదండ్రులు సైతం పొలం పనులు చూసుకునేవారు. పిల్లలకు ఏ లోటూ లేకుండా గారాబంగా పెంచారు. పిల్లలు బాగా చదువుకుని మంచిగా స్థిరపడాలన్నది రాయపరెడ్డి కోరిక. వీరి చదువుల కోసం పొలం కాస్తా కరుగుతూ వచ్చింది. సుధాకర్‌కు ఇద్దరు అన్నలు, ఒక అక్క. 7వ తరగతి వరకు కంచికచర్లలో చదువు సాగింది. 8–10 వరకు నల్గొండలోని కోదాడలో మేనత్త ఇంట్లో ఉండి చదువుకున్నారు. నెల్లూరులో ఇంటర్ బైపీసీలో చేరారు. ఎంసెట్ రెండుసార్లు రాశారు. 800 లోపు ర్యాంకు వచ్చింది. ఆ సమయంలో తక్కువ సీట్లుండడంతో ఆయన శ్రమ వృధా అయింది. వైద్యుడు కావాలన్న ఆయన తండ్రి ఆశయం నెరవేరలేదు.
చిన్ననాటి నుంచే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించడం సుధాకర్ నైజం. చుండూరు ఘటనపై తన మనసులో మాటను లేఖ రూపంలో రాసి తోటి విద్యార్థులకు పంచారు. పాఠశాలలో వ్యాసరచన పోటీల్లో ముందుండేవారు. ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా బహుమతి సైతం అందుకున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కావడంతో రచనలు సాగించాలి, సమాజంపై తనదైన ముద్రవేయాలి అన్న భావన మనసులో నాటుకుంది. అంతేకాదు నాయకత్వ లక్షణాలూ చిన్ననాటి నుంచే అలవడ్డాయి. 10వ తరగతిలో ఉన్నప్పుడు సహచర విద్యార్థికి రోడ్డు ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కోసం స్నేహితులు, తెలిసినవారి నుంచి విరాళాల రూపంలో రూ.30,000 సేకరించి బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచారు.
విజయవాడ సిద్ధార్థ కళాశాలలో బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నప్పుడే రచన జర్నలిజం కళాశాల నుంచి దూరవిద్యలో జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. సోదరుడు బాలశౌరిరెడ్డి ప్రోత్సాహం తోడైంది. ఒకవైపు డిగ్రీ చదువుతూనే ఈనాడులో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ కంట్రిబ్యూటర్‌గా 1997లో జర్నలిస్టుగా తొలి అడుగుపడింది. అక్కడి డెస్క్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన కాకుమాను అమర్‌కుమార్ భుజం తట్టారు. బీబీసీలో చేరాలి అన్న లక్ష్యంతో తన కలానికి పదును పెట్టారు సుధాకర్. విజయవాడలో గడ్డి కుంభకోణం వెలికితీశారు. గంజాయి అమ్మకాలపై స్టింగ్ ఆపరేషన్ చేశారు. అలా ఎన్నో ఆసక్తికర వార్తలతో జర్నలిజంలో తనదైన ముద్రవేశారు.
నెలకు రూ.300ల సంపాదన. బంధువులు హేళన చేసేవారు. దీంతో ఆయనలో పట్టుదల మొదలైంది. తనకు నచ్చిన జర్నలిజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆశయంతో నడుం బిగించారు. సంచలనాత్మక కథనాలు రాశారు. భౌతికదాడులూ ఎదుర్కొన్నారు. అయినా వెన్ను చూపలేదు. కలం ఆగలేదు. విజయవాడలోని ఆయన గది ఎందరో పేరున్న జర్నలిస్టులను తయారు చేసింది. డిగ్రీ పూర్తి అయ్యాక జీవిత లక్ష్య సాధనపై కసి పెరిగింది. పాత్రికేయ వృత్తిలో కష్టం, నిబద్దత, నిజాయితీతో రాణించాలన్న పంతం పట్టారు. అదే ఉత్సాహంతో ఈనాడు జర్నలిజం కళాశాలలో అడుగుపెట్టారు. 1997 బ్యాచ్ టాపర్‌గా నిలిచారు. గురువు బూదరాజు రాధాకృష్ణ నుంచి జర్నలిజం మెళకువలు నేర్చుకున్నారు. టాపర్ కావడంతో సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో సబ్ ఎడిటర్/రిపోర్టర్‌గా తొలి పోస్టింగ్ దక్కింది.
ఎడిటోరియల్ పేజీకి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణాత్మక స్టోరీలు రాశారు. 300లకుపైగా బైలైన్లు అందుకున్నారు. కులదీప్‌నయ్యర్, నురానీ వంటి ప్రముఖుల రచనలను తెలుగులో అనువదించారు. సివిల్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత ఆర్.సి.రెడ్డి స్వయంగా ఈనాడు కార్యాలయానికి సుధాకర్‌ను వెతుక్కుంటూ వచ్చారు. 21 ఏళ్ల వయసులోనే ఎడిటోరియల్‌కు రాయడాన్ని ఆశ్చర్యానికి లోనై, ప్రత్యేకంగా అభినందించారు. ఇంగ్లీషు జర్నలిజంవైపు వెళ్లాలన్న తన లక్ష్యానికి అనుగుణంగా విజయవాడలో డెక్కన్ క్రానికల్‌లో చేరారు. ఈనాడు కంటే తక్కువ వేతనానికే చేరడం గమనార్హం.
డెక్కన్ క్రానికల్‌లో 2001లో హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించారు. మానవీయ కథనాల కోసం మార్చురీల చుట్టూ తిరిగారు. అన్ని పోలీసు కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు తిరగడం ఆయన దైనందిన చర్య. అలా రోజూ కనీసం 110 కిలోమీటర్లు నగరం అంతా వార్తల కోసం చుట్టివచ్చేవారు. ఆయన శ్రమకు తగ్గట్టుగా ప్రతిరోజు బైలైన్ స్టోరీలు ప్రత్యక్షమయ్యేవి. అలా ఒక్కోరోజు 10 స్టోరీల దాకా ఇచ్చేవారు. ప్రతి వార్తా దేనికదే ప్రత్యేకం.
వలిగొండ రైలు ప్రమాదం సహజ విపత్తు కాదని, కింది స్థాయి ఉద్యోగి నిర్లక్ష్యమేనంటూ సంచలనాత్మక కథనం అందించారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై దాడి బంగ్లాదేశ్ ఉగ్రవాదుల పనేనని తేల్చిచెప్పారు. ఒక వార్త తెల్గీ స్కాంలో ఐపీఎస్‌ల అరెస్టుకు దారి తీసింది. మరో కథనంతో 14 కాలుష్యకారక కంపెనీలు మూతపడ్డాయి. ఓ కేసులో మాజీ పోలీసు అధికారి పాత్రను బయటపెట్టడంతో ఆయన నుంచి బెదిరింపులు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో ఉన్న ఓ వ్యాపారి ఏకంగా రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారంటే ఏ స్థాయిలో కథనాలను అందించారో అర్థం చేసుకోవచ్చు. అయితే పసలేని కారణంగా నోటీసును ఆ వ్యాపారి వెనక్కి తీసుకున్నారు. కిడ్నీల కుంభకోణం, నకిలీ సర్టిఫికేట్ల రాకెట్‌ను స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఆసియన్ ఏజ్‌తోపాటు ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యునల్ వంటి పలు అంతర్జాతీయ పత్రికల్లో సుధాకర్ రాసిన స్టోరీలు బైలైన్‌తో అచ్చు అవడం విశేషం.
16 ఏళ్లు డెక్కన్ క్రానికల్‌లో సేవలందించారు. ఆయన ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ హోదాలో కొత్త బాధ్యతల్లో ఉన్నారు. ప్రత్యేకత చాటుకోవాలన్న తపన చిన్ననాటి నుంచే సుధాకర్ రెడ్డిలో ఉండేది. అందుకు ఎంత కష్టమైనా ఓర్చుకునేవారు. ఇప్పుడూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ‘చిన్నప్పుడు కష్టం తెలియకుండా నా తల్లిదండ్రులు పెంచారు. ఈనాడులో జర్నలిజం కోర్సు చేస్తున్న సమయంలో హైదరాబాద్‌లోని చింతలబస్తీలో చిన్నగదిలో మకాం. వచ్చిన స్టైఫండ్ సరిపోయేది కాదు. పస్తులున్న రోజులూ ఉన్నాయి. అక్క పెళ్లి సమయంలోనే పరీక్ష ఉండె. జనగామ నుంచి రాత్రి సమయంలో లారీలో నగరానికి చేరుకున్నాను. అలా పరీక్ష రాసి టాపర్‌గా నిలిచాను. మచ్చలేకుండా బతకాలి అని నమ్మిన సిద్దాంతం కోసం ఇప్పటికీ అహోరాత్రులు శ్రమిస్తాను. మూడుపూటలా తినని రోజులెన్నో. ప్రతి వార్తను నిష్పక్షపాతంగా రాశాను. ఎంత ఒత్తిడి వచ్చినా ఎవరినీ వదలలేదు. నాకు నేనే చెక్కుకున్నాను. నా లక్ష్యాన్ని నేనే నిర్దేశించుకున్నాను. నా స్టోరీలే నాకు శ్రీరామరక్ష’ అని అంటారు సుధాకర్ రెడ్డి.
‘ఈ ప్రయాణంలో నా జీవిత భాగస్వామి దివ్యతేజ పాత్ర చాలా కీలకం. నాకోసం రాత్రి ఒంటి గంట వరకు వేచి ఉండేది. ఆ రాత్రి వేడివేడిగా వంట చేసేది. ఉదయాన్నే తను ఆఫీసుకు వెళ్లాల్సి ఉన్నా నా కోసం ఓపికగా సమయం వెచ్చించేది. వృత్తిపరంగా నాపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను. నా నిజాయితీని ఎవరైనా శంకించినప్పుడు బాధేస్తుంది. నాకు మెడిసిన్ సీటు రాలేదని నాన్న కన్నీళ్లు పెట్టుకున్న ఘటన ఇప్పటికీ గుర్తుంది. జీవిత ప్రథమాంకంలో అనుకున్న ఫలితాలు సాధించకపోయినా, పట్టుదలతో జర్నలిజంలో ఉన్నత స్థాయిలో చేరానన్న సంతృప్తి ఉంది. శ్రీశ్రీ రచనలు, మణిరత్నం సినిమాలు నాపై అమిత ప్రభావాన్ని చూపాయి’ అంటూ తన స్వగతాన్ని అచీవర్స్ స్టోరీస్‌తో పంచుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.