నారద వర్తమాన సమాచారం
కళకళలాడే నీళ్ల కింద మోగుతున్న డేంజర్ బెల్స్.. ప్రమాదం తప్పదా?
శ్రీశైలం జలాశయానికి ముప్పు పొంచి ఉందా..? కళకళలాడే నీళ్ల కింద పూడిక మట్టి డేంజర్ బెల్స్ మోగిస్తోందా..? అవుననే అంటోంది హైడ్రో గ్రాఫిక్ సర్వే. వరద పొటెత్తినప్పుడల్లా డ్యామ్‌లోకి టన్నుల కొద్ది పూడిక మట్టి తన్నుకొస్తుందని చెబుతోంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అంటోంది. వరదకు అడ్డుకట్ట వేయకపోతే జలాశయానికి ప్రమాదం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1960లో శ్రీశైలం దగ్గర కృష్ణా నదిపై రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభమై 1981లో పూర్తయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు అందిస్తున్న ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. సాగునీరు తాగు నీటితో పాటు విద్యుత్ వెలుగులు అందిస్తున్న ప్రాజెక్టు శ్రీశైలం. ప్రస్తుతం 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో, 215 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యంతో శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై మహా నగరానికి తాగునీటిని అందిస్తోంది.
ఇంత పెద్ద ప్రాజెక్టుకు గేట్ల దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. దీనిని ఇరిగేషన్ భాషలో ప్లంజ్ పూల్ అంటారు. 45 మీటర్ల లోతు 270 మీటర్ల వెడల్పు 400 అడుగుల పొడవున ఈ భారీ గొయ్యి విస్తరించింది. 1996లో భారీ వరదల కారణంగా ఈ గొయ్యి ఏర్పడింది. 2009లో రికార్డు స్థాయిలో వచ్చిన వరదలతో గొయ్యి పూర్తిస్థాయిలో విస్తరించింది. 25 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అవ్వడం అప్పట్లో సంచలనం అయింది.








