నారద వర్తమాన సమాచారం
జి.జి.హెచ్.,గుంటూరుకు రూ.2.10 లక్షల విలువైన ఐదు ఎయిర్ కండీషనర్లు విరాళం అందించిన న్యూరాలజిస్ట్ డా: జయ చంద్ర రెడ్డి….
గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జి.జి.హెచ్.)లో రూ.2,10,000/- విలువైన ఐదు కొత్త ఎయిర్ కండీషనర్లను నేడు ఏర్పాటు చేశారు. ఈ ఐదు ఎయిర్ కండీషనర్లను గుంటూరు మెడికల్ కళాశాలలో డా. సుందరాచారి వద్ద డి.ఎం. న్యూరాలజీ అభ్యసించి, ప్రస్తుతం ప్రొద్దుటూరులో వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ న్యూరాలజిస్టు డా. జయచంద్ర రెడ్డి విరాళంగా అందించారు.
విరాళంగా అందించిన ఐదు ఎయిర్ కండీషనర్లలో నాలుగు నెఫ్రాలజీ విభాగంలో, ఒకటి డి.ఆర్. విభాగంలో ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాల ద్వారా రోగులకు మరింత మెరుగైన వాతావరణంలో వైద్య సేవలు అందే అవకాశం కలుగుతుందని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్ (ఎఫ్‌ఏసీ) డా. సుందరాచారి మాట్లాడుతూ, గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థ పట్ల చూపుతున్న అనుబంధం, దాతృత్వం అభినందనీయమని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగుల సంక్షేమానికి ఎంతో ఉపయోగపడతాయని, ఇతర పూర్వ విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆసుపత్రి అభివృద్ధికి సహకరించిన డా. జయచంద్ర రెడ్డి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








