Thursday, November 21, 2024

ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌లపై వేటు…. పిఎస్ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌గున్ని సస్పెన్షన్‌

నారద వర్తమాన సమాచారం

ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌లపై వేటు

పిఎస్ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌గున్ని సస్పెన్షన్‌

నటి జత్వానీ అరెస్ట్‌ వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాలు

ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులపై వేటు వేసింది. ప్రస్తుతం వెయిటింగ్‌లో వున్న మాజీ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ పిఎస్ఆర్‌ ఆంజనేయులు, మాజీ విజయవాడ సిటీ పోలీస్‌కమిషనర్‌ కాంతిరాణా టాటా, మాజీ విజయవాడ డిసిపి విశాల్‌ గున్నిను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జిఓ నంబర్‌ 1590, 1591,1592ను ఆదివారం విడుదల చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఎసిపి హనుమంతరావులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర డిజిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైసిపి నేత కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఒక పారిశ్రామికవేత్తపై ముంబయిలో తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన వెంటనే ముంబాయిలో వున్న తనను 7.30 గంటలకు తల్లిదండ్రులతోపాటు అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె తెలిపారు. పిఎస్ఆర్‌ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్‌ను వెంటనే అరెస్టు చేయాలని, తనను వేధించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకొని తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని కాదంబరి జెత్వాని ఫిర్యాదులో వివరించారు. ఐపిఎస్‌ అధికారులపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై విచారణకు డిజిపి తిరుమల రావు ఆదేశించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు జరిపిన విచారణలో ఈ వ్యవహరంలో అనేక లొసుగులు బయటపడ్డాయి. ఈ మేరకు ఆయన నివేదిక రూపొందించి డిజిపికి అందజేశారు. దీని ఆధారంగా డిజిపి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉన్నతస్థాయిలో ఉన్న ఐపిఎస్‌ అధికారులు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారో వివరించారు. రాష్ట్రప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆ అంశాలనే పేర్కొంటూ ఒక్కో అధికారి పేరుతో విడివిడిగా జిఓలు జారీ చేసింది. పిఎస్ఆర్‌ ఆంజనేయులును సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన జిఓలో ఆయన జనవరి 31న విజయవాడ సిటి కమిషనర్‌ కాంతిరాణా టాటా, డిసిపి విశాల్‌గున్నిని సిఎంఓకు పిలిపించి ముంబాయిలో వున్న సినీనటి కాదంబరి జత్వానిని అరెస్ట్‌ చేయాల్సిందిగా, మౌఖికంగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఆయన పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు జిఓలో తెలిపారు. ‘ఆధారాలు లేకుండా, అసంపూర్తిగా ఉన్న ఫిర్యాదును ఆధారంగా తన ఉద్యోగ హోదాను అడ్డుపెట్టుకుని ఆదేశాలు జారీ చేశారు’ అని పేర్కొన్నారు. అలాగే కాంతిరాణా టాటా పోలీస్‌ కమిషనర్‌గా ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నుండి ఆదేశాలు రాగానే ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా అరెస్ట్‌ చేయడాన్ని మరో జిఓలో తప్పుపట్టింది. 2వ తేది నమోదైన ఈ కేసులో జెత్వానిని అరెస్ట్‌ చేసేందుకు పోలీస్‌కమిషనర్‌ క్యాంప్‌క్లర్క్‌ ఫిబ్రవరి ఒకటో తేదీనే ముంబాయికి విమానం టికెట్‌లను బుక్‌ చేసిన విషయాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. కమిషనర్‌ కాంతిరాణా టాటా ఓరల్‌ ఆదేశాల మేరకు డిసిపి విశాల్‌గున్నికి, అడిషనల్‌ కమిషనర్‌ రమణమూర్తిలకు, సిఐలు శ్రీధర్‌, షరీఫ్‌, సత్యనారాయణ, ఆర్ఎస్ఐ దుర్గాదేవి, కానిస్టేబుళ్లు టి మౌనిక, వై రమేష్‌, ఎం గీతాంజలి, ఎస్‌ రమ్యలకు విమాన టికెట్‌లను ఎఫ్ఐఆర్‌ కాకముందు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు, ఇతర ప్రాంతాలకు వెల్లేందుకు ఉన్నతాధికారుల అనుమతులు కూడా లేవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జెత్వాని కేసులో సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌గున్నిలు ‘నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారు. బాధితురాలిని వేధించినట్లు తేలింది’ అని ప్రభుత్వం ఉతర్వుల్లో పేర్కొంది. ఆ కారణంగానే క్రమశిక్షణా చర్యల కింద వీరు ముగ్గురిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. నటి జెత్వానిని వేదించి అక్రమంగా అరెస్ట్‌ చేసిన కేసులో మొత్తం 15 మంది పోలీస్‌ అధికారులు వున్నట్లు వివరించింది. ఇప్పటికే ఐదుగురిపై చర్యలు తీసుకోగా మిగలిన 10 మంది పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం పోతోంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading