నారద వర్తమాన సమాచారం
దాడి మూలాలను కనుక్కుంటాం.. దర్యాప్తు వివరాలను ప్రజల ముందు ఉంచుతాం: అమిత్ షా
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు
ఈ ఘటనలో 10 మంది మృతి, 20 మందికి గాయాలు
హ్యుందాయ్ ఐ20 కారులో సంభవించిన పేలుడు
ఘటనాస్థలిని, ఆసుపత్రిని సందర్శించిన అమిత్ షా
రంగంలోకి ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు
దాడి మూలాలను కనుక్కుంటామని కేంద్ర హోంమంత్రి హామీ
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ కారు పేలుడులో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సమాచారం అందిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అంతకుముందు గాయపడిన వారిని తరలించిన లోక్‌నాయక్ ఆసుపత్రిని అమిత్ షా సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాతో సమావేశమై ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనపై అమిత్ షా ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. “ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కొందరు పాదచారులు గాయపడగా, సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు ప్రాణాలు కోల్పోయారు” అని ఆయన తెలిపారు. పేలుడు తీవ్రతకు కొన్ని వాహనాలకు మంటలు అంటుకున్నాయని వివరించారు.
సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని షా చెప్పారు. “జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించాయి. ఆ ప్రాంతంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తాం. ఢిల్లీ పోలీస్ చీఫ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌చార్జ్‌తో నేను మాట్లాడాను. వారిద్దరూ ఘటనాస్థలంలోనే ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.
ఈ దాడి మూలాలను కనుగొనడానికి ప్రభుత్వం సమగ్రంగా, లోతుగా దర్యాప్తు జరుపుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు. దర్యాప్తులో వెల్లడైన వివరాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







