నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
మాపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
క్రోసూరులో టీడీపీ ఆఫీసు వద్ద పందిరి దగ్ధమైన ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆరోపణలపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు స్పందించారు. గత ఐదేళ్లుగా పెదకూరపాడులో ప్రశాంత వాతావరణం ఉందని.. కానీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన రోజు నుంచి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ కార్యాలయం వద్ద పందిరి దగ్ధమైన ఘటనతో తనకేం సంబంధం అని ప్రశ్నించారు. కార్యకర్తలు, బైకులు, కుర్చీలు అన్నీ క్షణాల్లో మాయం చేసి.. వాళ్లే పందిరి తగలబెట్టుకున్నారన్నారు. గతంలో ధరణికోటలో తమ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్నితగలబెడుతూ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారన్నారు. ఇప్పుడు ఎవరు నిప్పు అంటించారో తెలియదంటూనే.. తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధిగా ఈ ఘటనను ఖండిస్తున్నానని.. బాధ్యులను వెంటనే గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరుతున్నానన్నారు. క్రోసూరు ప్రజాగళం సభలో తనపై చంద్రబాబు ఆరోపణలకు తాను సమాధానమిచ్చానన్నారు. అంతే కాని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తాను మాట్లాడలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని విధ్వంస రాజకీయాలకు తెరతీస్తున్న టీడీపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని తాను కోరుతున్నానన్నారు.








