నారద వర్తమాన సమాచారం
నేటినుండి జనాభా లెక్కల తొలి విడత ప్రక్రియ ప్రారంభం: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నేటి నుండి జిల్లా వ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో మొదటి విడత ప్రారంభమవుతుందని, దీనిని 100 శాతం పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రాథమికంగా హౌసింగ్ మ్యాపింగ్ నిర్వహిస్తారని, ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి నిర్ణీత 33 రకాల ప్రశ్నలతో వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
గురువారం పల్నాడు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా లెక్కల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లుగా డీఆర్వో నారద మునిని నియమించారు.
అదే విధంగా వచ్చే నెల మొదటి గురువారం (మే 07) జిల్లా వ్యాప్తంగా ‘స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్.పి.వి (HPV) వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవిలను ఆదేశించారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ప్రతి ఇంట్లోనూ కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లు మరియు ఖాళీగా ఉన్న ఇంటి స్థలాల్లో న్యూట్రీ గార్డెన్స్ పెంచి, తద్వారా లభించే స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
జలధార – జల హారతి కార్యక్రమాలపై ద్వామా పీడీ సిద్ధలింగమూర్తి, విద్యా సంబంధిత అంశాలపై డీఈఓ రామారావు, ప్రకృతి వ్యవసాయంపై అమల కుమారి, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి తదితర అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా, భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించి, వారందరూ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలకు తమ పేర్లను నమోదు చేసుకునేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








