నారద వర్తమాన సమాచారం
పల్నాడులో సాకారమవునున్న వైద్య కళాశాల కలెక్టర్ కృత్తికా శుక్ల, ఐ పీ ఎస్
2026-27 విద్యా సంవత్సరం నుండే 100 సీట్లతో ప్రవేశాలు
ఏప్రిల్ 15 నాటికి అన్ని వసతులతో కళాశాల ఏర్పాటు
పల్నాడు జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. పిడుగురాళ్లలో నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ వైద్య కళాశాల పనులు తుది దశకు చేరుకున్నాయని, 2026-27 విద్యా సంవత్సరం నుండే 100 ఎంబీబీఎస్ సీట్లతో విద్యాబోధన ప్రారంభం కానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్ గౌర్ వెల్లడించారు.
బుధవారం నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, ఏపీ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావులతో కలిసి ఆయన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15 నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి, అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తూ ప్రస్తుతం ఉన్న 3 ఆక్సిజన్ సిలిండర్ పోర్టులను 4కు పెంచాలని సూచించారు. మే నెల చివరి నాటికి ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల మాట్లాడుతూ, “గతంలో అత్యవసర చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ మెడికల్ కాలేజీ ద్వారా గురజాల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం స్థానికంగానే అందుతుంది” అని పేర్కొన్నారు.
రూ. 100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పేదవాడికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రస్తుతం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, రికార్డుల నిర్వహణలోనూ ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం జానపాడు, కామేపల్లి గ్రామాల్లోని హెల్త్ క్లినిక్ సెంటర్లను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








