ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి: ప్రజా సంఘాలు
ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీ నిర్లక్ష్య వైఖరితో కళాశాల అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా వైఫల్యం
కళాశాలలో జరిగిన ఘర్షణలో విద్యార్థులకు జరగరానిది జరిగితే బాధ్యులెవరు
కళాశాలలో దిగజారిపోయిన ఇంటర్ ఫలితాలు
ప్రిన్సిపల్, అధ్యాపకులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంలోనున్న ఆంతర్యం ఏమిటి
ప్రిన్సిపల్ సరోజినీ పవర్, పలుకుబడి ఏమైనా పని చేశాయా
మీడియా సమావేశంలో ప్రజాసంఘాల ఆగ్రహం.. గురజాల అప్పారావు
మాచర్ల, ఏప్రిల్ 25: పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీ ప్రిన్సిపల్ నూతక్కి సరోజిని, ఏటీపీ, అధ్యాపకులపై ఆ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్, దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు డిమాండ్ చేశారు. శనివారం మాచర్ల పట్టణంలోని వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన సాగర్ ఏపీఆర్జేసీలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. దాదాపు 41 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ఫెయిల్యూర్ అయ్యారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కళాశాలకు అత్యంత దారుణమైన ఫలితాలు రావడం శోచనీయం అన్నారు. ఇలాంటి దారుణమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ఈ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన కళాశాలలో సైన్స్, ఆర్ట్స్ విద్యార్థుల మధ్య జరిగిన గ్యాంగ్ వారే కారణమన్నారు. కళాశాలలో విద్యార్థులు విద్యనభ్యసించాల్సి పోయి రెండు వర్గాలుగా విడిపోయి అర్ధరాత్రి వేళ సినీ ఫక్కీలో గ్యాంగ్ వార్ కు తలపడడం కళాశాలలో ఒక యుద్ధ వాతావరణం సృష్టించడం సిగ్గుచేటన్నారు. ఈ ఘర్షణలో విద్యార్థులకు జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నించారు. దీనంతటికీ ప్రధాన కారణం కళాశాల ప్రిన్సిపల్ నూతక్కి సరోజినీ, ఏటీపీ జయప్రకాష్, ఇతర అధ్యాపకుల వైఫల్యమేనన్నారు. కళాశాలలో ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా వైఫల్యం చెందడంతో విద్యార్థులు చదువును విస్మరించి ఇతరత్రా కార్యకలాపాలపై దృష్టి సారించారని మండిపడ్డారు. అయితే ఈ ఘటనపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఘటన అనంతరం వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేసి వెళ్లడం గమనార్హం అన్నారు. కానీ వచ్చారు వెళ్లారు అన్న నానుడి ప్రకారంగా ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉందే తప్ప వైఫల్యం చెందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఇతరులపై ఇప్పటివరకు శాఖా పరమైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. చర్యలు తీసుకోకపోవడంవెనక ఉన్న ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రిన్సిపల్ సరోజినీ పవర్, పలుకుబడి ఇంకేమైనా ఆమ్యామ్యాలు ఆ శాఖపై పనిచేశాయ అని పలు అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కళాశాలలో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు చదువుకొని నేడు ఉన్నత స్థాయిలలో ఉండగా ప్రస్తుతం ఆ కళాశాల దుస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అయితే కళాశాలలో విద్యార్థులు చేరేందుకు మక్కువ చూపకపోగా ఉన్న విద్యార్థులు కూడా వెళ్లి పోదామా అన్న ఆలోచనలో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. తక్షణమే ఆ శాఖ ఉన్నతాధికారులు కళాశాలను సందర్శించి కళాశాల పేరు,ప్రఖ్యాతులను దిగజార్చిన ప్రిన్సిపల్, ఏటీపీ, ఇతరులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల తాము కళాశాలలో జరిగిన సంఘటనపై, వైఫల్యం పై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్, హ్యూమన్ రైట్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా ఉద్యమిస్తామన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








