నారద వర్తమాన సమాచారం
ఏపీ ప్రజలకు భారీ ఊరట.. రెసిడెన్స్ ప్రూఫ్‌గా రేషన్ కార్డు, ఆధార్.. ఉత్తర్వులు జారీ ఏపీ ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెసిడెన్స్ సర్టిఫికెట్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డు, ఆధార్‌ను వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు సహా అన్ని ప్రయోజనాలకు నివాస రుజువు (రెసిడెన్స్ ప్రూఫ్)గా ఉపయోగించుకోవాలని తెలిపింది. పీవీటీజీ (ఆదివాసీ గిరిజనులు) కుటుంబాల వారికి ఆధార్ నమోదు, అప్డేట్ కోసం తహసీల్దార్లు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని మార్పులు చేస్తూ కొత్త జీవోతో మరింత స్పష్టత ఇచ్చారు…
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నియామకాలకు రెసిడెన్స్ ప్రూఫ్‌గా రేషన్ కార్డు, ఆధార్ ఇవ్వొచ్చన్నారు. అలాగే వివిధ నియామకాలు, సైనిక దళాల రిక్రూట్మెంట్ తదితర నిర్దిష్ట ప్రయోజనాల కోసమే నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికే వాటిని ఇచ్చి ఉంటే.. మళ్లీ జారీ చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టత ఇచ్చారు. తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాల జారీపై బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా.. మరోసారి ఆ ఉత్తర్వుల్ని సవరిస్తూ కొత్తగా మరో జీవో ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం నివాస ధ్రువీకరణపత్రాల జారీ అధికారాన్ని మళ్లీ తహసీల్దార్లకు అప్పగించింది. ఈ నివాస ధ్రువీకరణ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దారుకు సమర్పించాలన్నారు. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దారు స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధ్రువీకరించి పత్రం జారీచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా కొన్ని మార్పులు చేసి కొత్తగా జీవోను జారీ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








