నారద వర్తమాన సమాచారం
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్…..
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాంకేతిక సహాయం అందించిందట. ఈ విషయాన్ని తాజాగా చైనా మీడియా ధ్రువీకరించింది.
పాక్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించినట్టు చైనా తొలిసారి బహిరంగంగా అంగీకరించింది. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ)కి చెందిన చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇంజినీర్ జాంగ్ హెంగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను ప్రభుత్వ వార్తా సంస్థ అయిన ‘సీసీటీవీ’ ప్రసారం చేసింది. గతేడాది నాలుగు రోజుల పాటు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తాము పాకిస్థాన్ అధికారులతో కలిసి పనిచేసినట్టు జాంగ్ అంగీకరించారు.
చైనా తయారు చేసిన జే-10సీ యుద్ధ విమానాలను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జాంగ్ నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం పాక్‌కు సాంకేతిక సహాయం అందించింది. ఆ యుద్ధంలో తాను క్షేత్ర స్థాయిలో పని చేశానని, శారీరకంగా, మానసికంగా ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని జాంగ్ వెల్లడించారు. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చేసిన క్షేత్ర స్థాయి సహాయం గురించి అడిగిన ప్రశ్నలకు అప్పట్లో చైనా విదేశాంగ, రక్షణ శాఖలు సమాధానాలు ఇవ్వలేదు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








