నారద వర్తమాన సమాచారం
తానొకటి తలచిన దైవమొకటి తలచు
శివుని దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలూ వస్తుంటారు
మొదటగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వి గుడి లోపలికి వెళతాడు
తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనం గరుత్మంతుడిపై వచ్చి వాహనం దిగి గుడి లోపలికి వెళతాడు, ఆ విధంగా అందరు దేవతలూ గుడిలోకి వెళతారు
వాహనాలు గుడి బయట ఉంటాయి
అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుత్మంతుడి దగ్గరకు వచ్చి “యమధర్మరాజు అంటేనే మరణానికి సంకేతం, అటువంటి యమధర్మరాజు గుడిలో కి వెళ్లేముందు నన్ను చూసి నవ్వాడు. నాకు భయంగా ఉంది నన్నెలాగైనా కాపాడు” అని గరుత్మంతుడిని వేడుకుంది.
అప్పుడు గరుత్మంతుడు “నేను అన్నిటికన్నా వేగంగా పోగలను, మూడు ఘడియలలోపు నిన్ను ఏడు సముద్రాలకు అవతల వదిలి వస్తాను, అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు యముడు నిన్నేమీ చేయలేడు” అని చెప్పి ఆ చిన్న పిట్టను వేగంగా తీసుకెళ్ళి ఏడు సముద్రాలకు అవతల ఒక దీవిలో ఒక చెట్టు తొర్రలో వదిలి ‘నీకేం కాదులే హాయిగా ఉండు’ అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు.
కొంత సేపటికి దేవతలందరూ పూజ ముగించుకుని బయటకు వస్తారు.
అప్పుడు గరుత్మంతుడు యమధర్మరాజుతో ” యమధర్మరాజా నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్టను చూసి నవ్వావట ఎందుకు” అని అడిగాడు.
అప్పుడు యమధర్మరాజు ” ఏం లేదు నాకు బ్రహ్మ దేవుడు రాసిన అందరి తలరాతలూ కనిపిస్తాయి, ఆ చిన్న పిట్ట తలరాత చూసి నవ్వొచ్చింది” అని అన్నాడు.
ఆ పిట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు “ఆ చిన్న పిట్ట మూడు ఘడియలలో ఏడు సముద్రాలకు అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలో ఉన్న ఒక పాముకు ఆహారం కాబోతోంది అని రాసి ఉంది, ఆ చిన్న పిట్ట మూడు ఘడియల లోపు ఏడు సముద్రాలు దాటి వెళ్లలేదు, ఆ పాము కూడా ఏడు సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందో అని తలుచుకొని నవ్వొచ్చింది” అన్నాడు యమధర్మరాజు
తానొకటి తలచిన దైవమొకటి తలచు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.