Thursday, December 5, 2024

నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముని నూట ఓకట వ జయంతి

నారద వర్తమాన సమాచారం

మే :28

స్వర్గీయ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే కాదు..తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానేత. నటుడుగా, రాజకీయ నాయకుడుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవితాంతం పట్టుదల, క్రమశిక్షణతో జీవించారు.

ఎన్టీయార్‌ ప్రవేశంతో తెలుగు సినీ చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్‌ ఎంట్రీ తెలుగు నేల మీద రాజకీయ గతిని మార్చింది.

సినీ కళాకారుడుగా ఎన్టీ రామారావు చేయని పాత్ర లేదు. పౌరాణిక, జానపథ పాత్రల స్పెషలిస్ట్. రాముడు, కృష్ణుడి వేశం ఆయన మాత్రమే వేయాలి. ఆ పాత్రాలలో ఆయనను తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలాగే, ఆనేక జానపథ, చారిత్రక పాత్రలతో కూడా మెప్పించారు. సమాజ హితం కోసం తన ఇమేజ్‌ని సైతం పక్కన పెట్టి సాంఘిక చిత్రాలతో అరుదైన ప్రయోగాలు చేశారు. స్వయంగా వాటిని నిర్మించి దర్శకత్వం వహించారు.

హీరోగా కెరీర్‌ ఉచ్చ స్థితిలో ఉన్నపుడే బడిపంతులులో వృద్ధుడి వేశం వేశారు. కలసివుంటే కలదు సుఖంలో అవిటివాడిగా కనిపించారు. రక్తసంబంధంలో సావిత్రికి అన్నగా ట్రాజెడీ పాత్ర పోషించారు. ఈ తరం నటులు ఆ సాహసం చేయగలరా?

ఏ పాత్ర పోషించినా దానికి వన్నె తేవటం రామారావు గొప్పతనం. శ్రీరాముడు, శ్రీకృష్ణ పాత్రలే కాదు .. రావణాసురుగా..దుర్యోధనుడుగా కూడా అదే స్థాయిలో మెప్పించాడు. పౌరాణిక విలన్లలో కూడా హీరోయిజం ప్రదర్శించటం ఆయనకు చెల్లింది. దుర్యోధనుడితో డ్యుయెట్‌ పాడించటం కూడా రామారావుకే చెల్లింది.

ఎన్టీయార్‌ గొప్ప పట్టుదల కలిగిన మనిషి. 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు.

1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భాభవం తెలుగునాట ఒక రాజకీయ ప్రభంజనం. పార్టీని స్థాపించిన తరువాత చైతన్యరథంలో ఆయన సాగించిన ప్రచారం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. 90 రోజులలలో 35 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డు. కుమారుడు హరికృష్ణ చైతన్యరథానికి సారధిగా వ్యవహరించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు.

పేదల పక్షపాతిగా.. అన్నగారిగా కోట్లాది తెలుగు జనహృదయాలలో ఆయనది చెరగని ముద్ర. నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంతటి రాజకీయచైతన్యంతో ఉన్నారంటే ఎన్టీయార్‌ పాలనా సంస్కరణలే ప్రధాన కారణం. ఆయన అధికారంలోకి వచ్చేనాటికి పట్టెడు అన్నం మెతుకులకు నోచుకోని పేదలకు రెండు రూపాయలకు బియ్యం అందించారు. తద్వారా లక్షలాది మంది నిరుపేదలకు మూడు పూటలా అన్నం పెట్టిన దేవుడయ్యారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈ బియ్యం పథకాన్ని ఆపలేదు.

స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత ఎన్టీయార్‌దే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించి ఒక గూడు కల్పించాడు. అగ్రకుల పెత్తందార్లకు కొమ్ముకాసే పటేల్‌ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి సంచలనం రేపారు. తాలూకా, సమితి వంటి కాలం చెల్లిన వ్యవస్థలకు చరమగీతం పాడి మండల వ్యవస్థను ముందుకు తెచ్చారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దాంతో పాటే అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రభావవంతమైన అమలుకు నోచుకున్నాయి.

యువత, బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్ద పీట వేశారు. జనాభాలో సగం ఉన్న బీసీలకు అప్పటికి రాజకీయ ప్రాధాన్యం లేదు. ఎన్టీరామారావు రాకతో మొత్తం సీన్‌ మారింది. బీసీల రాజకీయ ఎదుగుదల ప్రారంభమైంది. అంతే కాదు ..అప్పటి వరకు స్తబ్దుగా ..అలసత్వానికి మారుపేరుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భరతం పట్టారాయన. ఆకస్మాక తనిఖీలతో ప్రభుత్వ సిబ్బందిని పరుగులు పెట్టించారు.

మండల వ్యవస్థ రద్దుతో పాటు మద్యపాన నిషేదం వంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. 1994 లో ఎన్. టి. రామారావు రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే మద్య నిషేధాన్ని విధించారు. జూన్ 1, 1995 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా దానికి కట్టుబడే మనిషి ఎన్టీయార్. చేసే పనిలో ధర్మం ఉంటే చాలు సమాజం ఏమనుకున్నా ఆయనకు డోంట్‌ కేర్‌. తన సహధర్మచారిణి బసవం తారక మరణం తరువాత తన బాబోగులు చూసే తోడు కోసం డెబ్బయ్యో ఏట ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులంతా ఏకమైన వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. లక్ష్మీపార్వతి మెడలో మూడు ముళ్లు వేశారు.

అధికారం అనుభవించాలనో… అక్రమ సంపాదన కోసమో ఎన్టీ రామారావు రాజకీయాల్లో రాలేదు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. తన అరవయ్యో ఏట సన్యాసిలా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. కాషాయ వస్త్రాలు ధరించారు. సీఎం కి వచ్చే జీత భత్యాలు కూడా వద్దన్నారు. జీతంగా కేవలం ఒక్క రూపాయి తీసుకున్న ముఖ్యమంత్రి ఆయన.

ఓట్ల కోసం ప్రజలను మాటలతో మోసం చేయాలనే ఆలోచన కనీసం ఆయన ఊహల్లో కూడా ఉండదు. జనం ఓటేయటానికి ఆయన బొమ్మ చాలు. అలా ఎందరో రాజకీయ అనామకులను అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పంపిన పొలిటికల్‌ లెజెండ్‌ డాక్టర్‌ ఎన్టీయార్‌!

1968లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. తోడు దొంగలు, సీతారామ కళ్యాణం, వరకట్నం చిత్రాలకు జాతీయ పురస్కారాలు లభించాయి.

1923 మే 28వ తేదీన లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీ రామారావు జన్మించారు. 1942 మేలో తన 20వ ఏట మేనమామ కూతురు బసవ రామతారకంతో వివాహం జరిగింది. వారికి 11 మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు.

రామారావు కాలేజీలో ఉన్నపుడే వివిధ కారణాల వల్ల కుటుంబ ఆస్తి మొత్తం హరించుకుపోయింది. దాంతో జీవనం కోసం ఆయన అనేక చిన్నా చితక వ్యాపారాలు చేశారు. 1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు పాలు పోశాడు. 1947లో బీఏ పూర్తి చేసిన తరువాత మద్రాసు సర్వీసు కమిషను పరీక్షలో పాసై మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారుగా ఉద్యోగం సంపాదించాడు.సినిమా ఆఫర్‌ రావటంతో నెల రోజులు కూడా ఆ ఉద్యోగం చేయలేదు.

నిర్మాత బి.ఏ.సుబ్బారావు ద్వారా రామారావుకు తొలి అవకాశం లభించింది. పల్లెటూరి పిల్ల సినిమా కోసం ఆయన్ని కథానాయకుడిగా ఎంపికచేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కనుక, ఆయన మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది మనదేశంతోనే.

1949లో విడుదలైన మనదేశంలో ఎన్టీయార్‌ పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. తరువాత 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు వచ్చింది. అలా నందమూరి ఆయన చలనచిత్ర జీవితం ముందుకు సాగింది. తరువాత ఆ రంగంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించారో అందరికి తెలుసు. 44 ఏళ్ళ కెరీర్‌లో దాదాపు మూడు వందల చిత్రాల్లో నటించి చారిత్రక, జానపద,సాంఘిక, పౌరాణిక పాత్రాలు పోషించారు.

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వకపోవటం ఒక లోటు.భారత ఇవ్వాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. రాజకీయ, కళారంగాలలో విశేష సేవలందించిన ఆయన కన్నా ఎవరు దానికి అర్హులు? ఆయనకు అవార్డు లభిస్తే మొత్తం తెలుగు జాతికి ఇచ్చినట్టే. కానీ, ఆయన మరణించి ఇన్నేళ్లయినా ప్రభుత్వాలకు ఈ విషయం గుర్తు రావట్లేదు. స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలో చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో చక్రం తిప్పారో అందిరికి తెలుసు. అప్పుడు కూడా ఆ మహానటుడు, ఆ రాజకీయ ధిగ్గజానికి భారతరత్న ప్రకటించక పోవటం ఆశ్చర్యం. దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానం కలగకమానదు. ఏదేమైనా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికి ఆ అవార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా జన హృదయాలలో ఆయన ఎప్పటికీ భారతరత్నమే!!


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading