నారద వర్తమాన సమాచారం
ఉగ్రవాదుల ఊచకోత.. గంటల్లోనే 600మందిని కాల్చివేత.. మహిళలు, చిన్నారులే అధికం
ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో మారణహోమం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 600 మందికిపైగా మృతి చెందారు. అందులో
మహిళలు, చిన్నారులే అత్యధికంగా ఉన్నారు. అయితే ఈ అత్యంత భయానక ఘటన.. ఆగస్ట్‌లో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. భారీ స్థాయిలో వందల మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటన తెలిసి ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఆ మృతదేహాలను సేకరించేందుకే 3 రోజులు పట్టినట్లు అంతర్జాతీయ మీడియా కొన్ని కథనాలు వెలువరించింది. ఈ ఘటన తర్వాత ప్రజల్లో తీవ్ర భయం నెలకొని.. వారు ఆందోళనలు చేయగా.. అక్కడి సైన్యమే వారిని అణిచివేసిందని స్థానికులు పేర్కొన్నట్లు మీడియా తెలిపింది.
బుర్కినా ఫాసోలోని బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు 600 మందికి పైగా ప్రజలను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేశారు. ఆగస్టు 24వ తేదీన జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. బైక్‌లపై చొరబడిన ఉగ్రవాదులు.. కళ్లకు కనిపించిన వారిపై తూటాల వర్షం కురిపించారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వాల్ ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం) ఉగ్రవాదులు ఈ మారణహోమానికి పాల్పడినట్లు మీడియా పేర్కొంది.
బుర్కినా ఫాసోలో తరచూ ఉగ్రదాడులు జరుగుతుండటంతో ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు.. ఆయా గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని అక్కడి సైన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఆగస్టు 24న బర్సాలోగో పట్టణ ప్రజలు కందకాలు తవ్వుతుండగా.. వారిని సైనికులు అని భావించిన ఉగ్రవాదులు.. కాల్పులు జరిపారు. ప్రాణాలు దక్కించుకునేందుకు.. జనం పరుగులు పెట్టినా వెంటాడి మరీ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. మొదట ఈ మారణ హోమంలో 200 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసినా.. ఆ తర్వాత మాత్రం 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా గణాంకాలు వెలువడ్డాయి.
అయితే ఈ మారణ హోమం తర్వాత చనిపోయిన వారి మృతదేహాలను సేకరించేందుకు స్థానిక అధికారులకు 3 రోజుల సమయం పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ దాడి తర్వాత బుర్కినా ఫాసో దేశం మొత్తం భారీగా నిరసనలు, ఆందోళనలు జరగ్గా.. అక్కడి సైన్యం వారిని అణచివేసినట్లు సమాచారం. బుర్కినా ఫాసోలో ప్రజా ప్రభుత్వంలో రెండుసార్లు సైన్యం తిరుగుబాటు చేసి.. చివరికి 2022లో మిలిటరీ పాలనా పగ్గాలు చేపట్టింది. అప్పటినుంచి ఆ దేశంలో ఉగ్రవాదుల ఊచకోతలు జరుగుతునే ఉన్నాయి. గతంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో 2 గ్రామాల్లోని దాదాపు 200 మందికి పైగా ప్రజలను సైన్యమే కాల్చి చంపడం తీవ్ర విమర్శలకు కారణం అయింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.