నారద వర్తమాన సమాచారం
వైఎస్సార్‌సీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో మర్యాదలు చేసిన వీడియో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసు స్టేషన్ లోపల పడక ఏర్పాటు చేసి, దిండు ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై గతంలో దారుణమైన వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో మర్యాదలు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
అయితే, ఆ దృశ్యాలు బయటకి ఎలా వచ్చాయనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేయగా మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని పలు ఇళ్లలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీలను రహస్యంగా చూస్తున్న వైనం బయటపడింది.
గుంటూరు చెందిన శేషు అనే వ్యక్తి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే సంస్థలో టెక్నీషియన్ పనిచేస్తున్నాడు. సంస్థకు వచ్చే ఆర్డర్ల మేరకు ఇళ్లు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలు, ఫామ్‌హౌస్‌లతో సీసీ కెమెరాలు బిగిస్తుంటాడు. అయితే, సీసీ కెమెరాలు బిగించిన తర్వాత.. వాటి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటివి సంబంధిత యజమానులకే ఇచ్చేసి, వారికి మాత్రమే యాక్సెస్ ఇవ్వాల్సి ఉండగా.. శేషు మాత్రం వారికి తెలియకుండా తన వద్ద కూడా యాక్సెస్ ఉంచుకొని, ఆయా సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యే దృశ్యాలను రహస్యంగా చూస్తున్నాడు. వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నాడు.
శేషు అంతటితో ఆగకుండా.. ఈ ఫుటేజీలను అడ్డం పెట్టుకొని యజమానులను బెదిరింపులకు పాల్పడిన ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ టీవీ ఛానల్ కెమెరామెన్, పత్రికా విలేకరితో కలిసి బాధితులను బెదిరింపులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గుంటూరు పోలీసులు ఈ ముగ్గురిపై 4 కేసులు నమోదు చేశారు.
గుంటూరు పట్టణంలో ఓ స్పా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఓ రిటైర్డ్ ఆర్‌ఎస్‌ఐకి సంబంధించిన ఫాం హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను శేషు రహస్యంగా చూసినట్లు పోలీసులు గుర్తించారు. మరో 11 చోట్ల సీసీ కెమెరాల యాక్సెస్ పొంది.. ఆ దృశ్యాలను శేషు తన మొబైల్‌లో చూస్తున్నట్లు తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసులు నమోదు చేశారు.
ఇక అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లోనూ శేషు గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. వాటి యాక్సెస్‌ను తనవద్ద పెట్టుకొని రహస్యంగా ఫుటేజీలను చూశాడు. బోరుగడ్డ అనిల్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మేనల్లుడైన మైనర్ బాలుడిని స్టేషన్ లోపలికి అనుమతించారు. బోరుగడ్డ అనిల్‌కు పడక, దిండు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో శేషు ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.