నారద వర్తమాన సమాచారం
కుటుంబాన్ని చంపి అనాథనయ్యానని ఏడ్చేరకం జగన్: చీఫ్ విప్ జీవీ
చేజేతులా కుటుంబాన్ని చంపుకుని జడ్జి ముందు అనాథనయ్యాను కరుణించమని ఏడ్చేరకం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. అయిదేళ్లపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విద్యావ్యవస్థతో చెడుగుడు ఆడుకుని ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడమే అందుకు నిదర్శనమన్నారు. కేవలం అయిదేళ్లలో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకుని వెళ్లిన జగన్ అరాచకాలకు ముందుగా బలైపోయింది విద్యావ్యవస్థనే అని వాపోయారాయన. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు, పాఠశాల విద్యలో సమస్యలు అంటూ జగన్ రాద్ధాంతం చేస్తున్నారంటూ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ మేరకు దుయ్యబట్టారు. దిగిపోయే నాటికి ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు రూ. 3,480 కోట్లు పెట్టిన ప్రబుద్ధుడు ఇప్పుడు వాటి పేరు చెప్పి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూడడాన్ని ఏమనాలంటూ నిలదీశారు. వాటితోపాటు పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించి రూ.వెయ్యి కోట్లు, చిన్నారుల చిక్కీలు, కోడిగుడ్లకు కూడా రూ.178 కోట్లు, పిల్లలకు కుట్టుకూలికి ఇవ్వాల్సిన రూ.65కోట్లు కూడా ఇవ్వకుండా పోయింది కాక ఇప్పుడు మాట్లాడ్డానికి సిగ్గుశరం ఉండాలన్నారు చీఫ్ విప్ జీవీ. చేసిన పనులన్నీ చేసి ఇప్పుడొచ్చి ఫీజుబకాయిలంటున్న జగన్ దొంగనాటకాల్ని ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమ్మఒడి ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చే యాలని చూస్తున్న దుర్మార్గుడికి ఇటీవలే బడ్జెట్‌లో తల్లికివందనం పథకానికి రూ.6,487 కోట్లు కేటాయించింది కనిపించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రూ. పది లక్షల కోట్లు పైగా అప్పుల్లో పెట్టి పోయిన జగన్ నిర్వాకాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసలు, వడ్డీల రూపంలో రూ. 53,253.30 కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పుల కుప్పలు దీనికి అదనం అని, వాటి వాయిదాలు, వడ్డీలు కూడా కలిపితే ఏడాదికి 70 వేల కోట్లకు పైగా భారం పడుతుందన్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు గుదిబండలా మారినా వాటిని చెల్లిస్తూనే కొత్త వాటికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిఒక్కరు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను అభినందిస్తుంటే జగన్ మాత్రమే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని తూర్పారాబట్టారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.