నారద వర్తమాన సమాచారం
మూడు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన ‘గాలి’ రాజకీయ జీవితం ఖతం..?
‘ఈ గాలిని ఆపాలి’.. 2007 సమయంలో యూపీఏ చైర్ పర్సన్ గా దేశాన్ని శాసించే స్థితిలో ఉన్న సోనియాగాంధీ స్వయంగా చేసిన వ్యాఖ్య.. ఇప్పుడంటే చాలామంది హెలికాప్టర్లు, ప్రయివేట్ జెట్ లు కొంటున్నారు.
ఆయన దాదాపు 20 ఏళ్ల కిందటే వాడారు.
కర్ణాటకలో బళ్లారి వంటి జిల్లాను గుప్పిట పట్టిన బలం.. ఇల్లంతా బంగారం.. బంగారు పల్లెంలో భోజనం.. అత్యంత అట్టహాసంగా కుమార్తె వివాహం.. తుప్పు పట్టి పోయేంతగా 53 కిలోల బంగారు నగలు.. బీజేపీ వంటి జాతీయ పార్టీని కర్ణాటకలో శాసించే స్థాయిలో బలం.. దేన్నయినా డబ్బుతో కొట్టగల బలగం..
..ఇదంతా తెలుగువారైన సాధారణ కానిస్టేబుల్ కుమారుడి ప్రస్థానం. ఓ రకంగా అతడిది ఎవరూ ఊహించని ప్రస్థానం.. మరో రకంగా కొందరికి అవినీతి సామ్రాజ్యం.
15 ఏళ్ల కిందటి వరకు ఆయన పేరు చెబితేనే జాతీయ స్థాయిలో సంచలనం.. మరిప్పుడు..?
రాజకీయంగా ఆదరించిన పార్టీ పక్కనపెడితే.. సొంత పార్టీ పెట్టుకున్నారు.. ఒకప్పుడు బళ్లారిలో ఆయన మాట శాసనం. మరిప్పుడు పట్టు పూర్తిగా సడలింది..
ఇదంతా మైనింగ్ కింగ్ గా పేరున్న గాలి జనార్దనరెడ్డి గురించి. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి కర్ణాటకలో సెటిలైన సాధారణ కానిస్టేబుల్ కుమారుడైన ఆయన ఆర్థికంగా, రాజకీయంగా చకచకా ఎదిగారు. ఇప్పుడు అంతే కష్టాల్లో పడ్డారు.
2009 తర్వాత గాలి జనార్దనరెడ్డి జీవితం మారిపోయింది. రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసు చుట్టుముట్టింది. చివరకు అదే కేసులో ఇప్పుడు ఆయనకు జైలు శిక్ష పడింది. రూ.వందల కోట్ల (రూ.500 కోట్లని అంటారు) ఖర్చుతో కూతురు పెళ్లి, ఇంట్లో బంగారం సింహాసనం కిరీటాలు.. ఇవీ గాలి గురించి అప్పట్లో వచ్చిన కథనాలు.. ఇప్పటికే చాలా సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఆయన మరోసారి జైలుకు వెళ్లే పరిస్థితి.
ఒకప్పుడు పట్టుబట్టి మరీ తనకు, తన సోదరుడికి, సన్నిహిత మిత్రుడికి కర్ణాటకలో మంత్రి పదవులు పొందిన గాలి జనార్దన రెడ్డి.. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఎందుకంటే ఏడేళ్ల జైలు శిక్ష పడింది కాబట్టి. ..మొత్తానికి గాలి ప్రాభవం అలా వెలిగి ఇలా మాయమైంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.