![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/06/img-20240602-wa11573271797151100179191-1024x576.jpg?resize=696%2C392&ssl=1)
నారద వర్తమాన సమాచారం
మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ వస్తుందని ఎవరూ కల కూడా కనలేదు.. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది.. బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తామని మాట్లాడుతున్నారు.. ఇవన్నీ టెంపరరీ సెట్‌బ్యాక్స్.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అందులో 100శాతం అనుమానం లేదు.. 25 ఏళ్ల ప్రస్థానమున్న పార్టీని ఖతం చేయగలరా..? పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే అధికారం.. అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భరించలేనటువంటి, అమానుషానికి లోనైన తెలంగాణ దుఃఖాన్ని తలుచుకుని బాధపడేవాళ్లమన్నారు. తెలంగాణ అనకూడదని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీచేసిన రోజులను గుర్తుచేశారు. రాజీలేని పోరాటం చేసిన జయశంకర్ తనతో ఉండేవారని.. అన్ని సందర్భాల్లో ఆయన తనతో ఉన్నారని తెలిపారు.
కఠోరమైన సిద్ధాంతాలు నమ్మేవాళ్లు కూడా.. ఒక్కోసారి ఆ సిద్ధాంతాలను పక్కనబెట్టి పనిచేయాల్సి వస్తుందన్నారు. 1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది.. చాలా మంది పెద్దలు అప్పుడు పోరాటం చేశారు.. వాళ్లను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోచారం లాంటి వాళ్లు అనేకసార్లు జైళ్లకు వెళ్లారు.. తెలంగాణకు జరిగే అన్యాయాలను జయశంకర్ ప్రశ్నిస్తూ వచ్చారంటూ గుర్తుచేశారు. గొప్ప ఉద్విగ్నభరితమైన క్షణం ఈ రోజు.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. వలసలకు, కరెంట్ కోతలకు, ఆత్మహత్యలకు.. చేనేత కార్మికుల ఆకలి చావులకు గురైన తెలంగాణ ఉండేది.. తలుచుకుంటేనే దుఃఖం వస్తుందన్నారు.
మనం తెలంగాణకు ఏం చేయలేమా అనే పరిస్థితి ఉండేది.. తెలంగాణ రాష్ట్రం కాదు.. తెలంగాణ మాట అనడమే కష్టంగా ఉండేదన్నారు. తెలంగాణ అనే పదం వాడొద్దని గతంలో స్పీకర్ ఆదేశించారు.. వెనకబాటు ప్రాంతం అనాలని చెప్పారన్నారు.
తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటం చేశారని.. వారందరూ సదా స్మరణీయులు.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 1969లో ఉద్యమానికి ప్రధాన కారణం ముల్కీ రూల్స్.. అని.. ముల్కీ రూల్స్‌పై విద్యార్థులు, యువకులు పోరాడారన్నారు. ఆ తర్వాత ఉద్యమం సమసిపోయిందన్నారు. ముల్కీ రూల్స్‌పై తెలంగాణకు అనుకూలంగా..సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందన్నారు. ఆ వెంటనే జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందన్నారు. అక్కడ కూడా 70 మందికిపైగా చనిపోయారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి.. రాజ్యాంగ సవరణ ద్వారా ముల్కీ రూల్స్ రద్దు చేశారన్నారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడినవాళ్లు కూడా లేరన్నారు. పాలమూరులో సభ పెట్టి పోరాటం చేస్తే.. అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు.
అప్పట్లో కుడి కాలువకు ఫ్రీ..ఎడమ కాలువకు ఛార్జీలు వసూలు చేసేవాళ్లు అని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఉండాలని.. తాను నిలదీస్తే ప్రభుత్వం దిగొచ్చిందని కేసీఆర్ వివరించారు. ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన కేసీఆర్.. తనదైన శైలిలో మాట్లాడారు.. లోక్ సభ ఫలితాలు ఎలా ఉన్నా.. తెలంగాణకు బీఆర్ఎస్ రక్షణ కవచమన్నారు.
ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లయిన సందర్భంగా అమరులను స్మరించుకున్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణను కేసీఆర్ ఆధ్వర్యంలో సాధించి.. పదేళ్లలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణను మార్చామన్నారు. దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేయడం సీఎం రేవంత్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు కేటీఆర్..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.