నారద వర్తమాన సమాచారం
జూన్ :03
కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచరా?
స్పందించిన గుంటూరు జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ
ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగడంతో, కౌంటింగ్ కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారని ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని పోలీసులు తెలిపారు.
అమరావతి ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రావడంతో అసలు ఫలితాలపై చర్చ జోరందుకుంది. మరో రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది.
ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసాలు, కార్యాలయాల వద్ద భద్రత భారీగా పెంచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఎన్నికల రోజు, ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో కౌంటింగ్ కు ముందే వైసీపీ అధినేత, టీడీపీ అధినేతలకు భద్రత పెంచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాలు, పార్టీ కేంద్ర కార్యాలయాలకు భద్రత పెంచారని ఫొటోలు చక్కర్లు కొట్టాయి.
జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని గుంటూరు జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు.
ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నివాసాల వద్ద సాధారణంగానే పటిష్ట భద్రత ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాల సమయం అని అదనపు భద్రత పెంచామన్న వార్తల్లో నిజం లేదన్నారు.
ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ ఉండటంతో బందోబస్తుకు వచ్చిన సిబ్బంది వారి వారి డ్యూటీ పాయింట్ కు వెళ్తున్నారు.
ఆ డ్యూటీలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది వస్తూ పోతూ ఉన్నందువల్లే సెక్యూరిటీ పెంచినట్లు భావించి ఉంటారన్నారు.
కానీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద అదనపు భద్రత, బలగాలు పెంచడం నిజం కాదని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.