నారద వర్తమానం సమాచారం
వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి: జాయింట్ కలెక్టర్ సంజనా సింహ
జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’
నరసరావుపేట, మార్చి 17
వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని పి.జి.ఆర్.ఎస్ హాలులో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులకు మరియు సమాజానికి మెరుగ్గా వివరించగలరని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆన్‌లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యత లోపించినప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
జిల్లా సరఫరా అధికారి ఎం.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అది సకాలంలో అందుతోందా, సరైన తూకంతో వస్తోందా, లేదా అన్నది గమనించాలని కోరారు.
సమావేశంలో భాగంగా ఆహార భద్రత, తూనికలు-కొలతల శాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల యంత్రాలను ప్రదర్శించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను ఎలా గుర్తించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. అనంతరం వినియోగదారుల హక్కులపై రూపొందించిన గోడ పత్రికలు, కరపత్రాలను విడుదల చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









