నారద వర్తమాన సమాచారం
జూన్ :10
ఏపీ సీఎం గా చంద్రబాబు …ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు – సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12న ఉదయం 11 గంటల 27నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్‌లు:
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించిన ఐఏఎస్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఉన్నతాధికారుల సమన్వయంతో పర్యవేక్షణ బృందం దగ్గరుండి ఏర్పాట్లను చేయిస్తోంది. పనుల్లో వేగం పెంచాలని ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా పటిష్టంగా చేపట్టాలని సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పెద్దసంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
10 వేల మంది పోలీసులతో బందోబస్తు:
గుంటూరు, ఏలూరు రేంజ్‌లు, విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్-ఎస్పీజీ బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్ చేసింది. ఈనెల 11, 12 తేదీల కోసం ముందుగానే ప్రభుత్వ సాధారణ పరిఫాలన శాఖ ఆధ్వర్యంలో గదులను బుక్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.